
టెస్టు క్రికెట్ ప్రేమికులకు మజా అందించిన ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సోమవారంతో ముగిసింది. ఇంగ్లండ్- భారత్ (IND vs ENG) మధ్య జరిగిన ఈ ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమమైంది. ఓవల్ మైదానంలో ఆఖరి రోజు వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఐదో టెస్టులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో జయభేరి మోగించి.. ఈ మేరకు సిరీస్‌ను డ్రా చేసుకుంది.
ఇక చివరి టెస్టులో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా.. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో పాటు.. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకున్నారు.
నాలుగో రోజు వరకు గిల్‌కే ఓటు
ఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు నామినేషన్ల గురించి భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. టీమిండియా హెడ్‌కోచ్ హ్యారీ బ్రూక్ ప్రతిపాదించగా.. ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ శుబ్‌మన్ గిల్ పేరు చెప్పాడట.
అయితే, ఐదో టెస్టు ఆట ఐదో రోజుకు చేరే సరికి మెకల్లమ్ తన నిర్ణయాన్ని మార్చుకోవడం విశేషం. గిల్‌ను కాదని సిరాజ్‌కు ఈ అవార్డు ఇస్తే బాగుంటుందని మెకల్లమ్ భావించాడట. ఈ విషయం గురించి కామెంట్రీ ప్యానెల్‌లో ఉన్న దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ మ్యాచ్ నాలుగో రోజే ముగిసి ఉంటే.. శుబ్‌మన్ గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు.
బ్రెండన్ మెకల్లమ్ గిల్ పేరే చెప్పాడు. ఇందుకు తగ్గట్లుగానే మైక్ ఆథర్టన్ ప్రజెంటేషన్‌లో అడగాల్సిన ప్రశ్నలు సిద్ధం చేసుకున్నాడు. శుబ్‌మన్ గిల్‌కు సంధించే ప్రశ్నల జాబితా రెడీ చేసుకున్నాడు.
మాట మార్చేసిన మెకల్లమ్
కానీ.. అరగంట.. 40 నిమిషాలు గడిచిన తర్వాత మెకల్లమ్ మహ్మద్ సిరాజ్ పేరు ప్రతిపాదించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ కూడా సిరాజ్ బౌలింగ్‌ను ఆస్వాదించానని చెప్పాడు’’ అని పేర్కొన్నాడు.
కాగా ఐదో టెస్టులో సిరాజ్ మొత్తంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. గిల్ సిరీస్ మొత్తంలో కలిపి రికార్డు స్థాయిలో ఏకంగా 754 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 269. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులోనే గిల్ 430 (269+161) పరుగులు రాబట్టడం విశేషం.
మరోవైపు.. హ్యారీ బ్రూక్ ఐదు టెస్టుల్లో కలిపి.. రెండు శతకాల సాయంతో 481 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 158. ఆఖరి టెస్టులో అతడు 98 బంతుల్లోనే 111 పరుగులు సాధించడం విశేషం. దీంతోనే మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లగా.. సిరాజ్ అద్భుత డెలివరీతో ఆఖరి వికెట్ తీసి.. భారత జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు సంక్షిప్త స్కోర్లు
👉వేదిక: కెన్నింగ్‌టన్ ఓవల్, లండన్
👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్
👉టీమిండియా- 224 & 396
👉ఇంగ్లండ్- 247 & 367
✊ఆరు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం.
చదవండి: నేనే గనుక ఆ క్యాచ్ పట్టి ఉంటేనా: సిరాజ్ ఎమోషనల్.. గిల్ రియాక్షన్ వైరల్