చరిత్ర సృష్టించిన తంగవేలు.. మనసును కదిలించే కథ | Sakshi
Sakshi News home page

Mariyappan Thangavelu: చరిత్ర సృష్టించిన తంగవేలు.. మనసును కదిలించే కథ

Published Wed, May 22 2024 1:12 PM

Mariyappan Thangavelu Breaks Record Win Gold High Jump World Para Athletics

భారత పారా అథ్లెట్‌ మరియప్పన్‌ తంగవేలు సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో T63 హై జంప్‌ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించాడు.

జపాన్‌లోని కోబేలో జరిగిన ఈవెంట్లో 1.88 మీటర్లు దూకి పసిడి ఒడిసిపట్టాడు 28 ఏళ్ల తంగవేలు. అంతేకాదు పనిలో పనిగా శరత్‌ కుమార్‌ పేరిట ఉన్న(1.83 మీటర్లు) రికార్డు కూడా బద్దలు కొట్టాడు.

మనసును కదిలించే కథ
తమిళనాడుకు చెందిన మరియప్పన్‌ తంగవేలు ఐదేళ్ల వయసులో ఘోర ప్రమాదానికి గురయ్యాడు. తాగి బస్సు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన కుడికాలును శాశ్వతంగా పోగొట్టుకున్నాడు.

అయితే, తంగవేలు చదివే పాఠశాలలోని పీఈటీ సర్‌ అతడిని ఎంతగానో ఎంకరేజ్‌ చేశాడు. ఒంటికాలితోనే హై జంప్‌లో రాణించేలా శిక్షణ ఇచ్చాడు.

తల్లే తండ్రిగా మారి.. రోజూ వారీ కూలీగా
తంగవేలు బాల్యం కూడా కష్టంగా గడిచింది. అతడి తల్లి రోజూ వారీ కూలీ. కొడుకును పోషించుకునేందుకు అప్పుడప్పుడు కూరగాయలు కూడా అమ్మేవారు.

ఇలాంటి ఒడిదుడుకుల నడుమ పాఠశాల విద్య పూర్తి చేసిన తంగవేలు బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ సంపాదించాడు. చదువుకుంటూనే ఆటపై కూడా దృష్టి సారించిన అతడు జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించాడు.

పారాలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌
అంచెలంచెలుగా ఎదిగిన తంగవేలు 2016 రియో పారాలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచాడు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో మాత్రం రజతంతో సరిపెట్టుకున్నాడు.

అందుకున్న పురస్కారాలు
హై జంప్‌లో విశేష ప్రతిభ కనబరిచిన తంగవేలును భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అదే విధంగా అర్జున అవార్డు కూడా ప్రదానం చేసింది. ఇక తంగవేలు 2020లో అత్యుత్తమ క్రీడా పురస్కారం ఖేల్‌ రత్న అందుకున్నాడు. ధ్యాన్‌ చంద్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు.

డబ్బు మొత్తం వాటికే ఖర్చు పెట్టి
వివిధ టోర్నీల్లో పతకాలు గెలవడం ద్వారా సంపాదించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తంగవేలు పొలాలు కొనేందుకు వినియోగించాడు. తన తల్లి కోసం ఇంటిని కూడా నిర్మించాడు.

చదవండి: MS Dhoni: ఐపీఎల్‌కు గుడ్‌బై?.. ధోని కీలక వ్యాఖ్యలు

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement