టీ20ల్లో మలాన్‌ నంబర్‌వన్‌ 

Malan Removes Babar Azam From First Place In T20I Rankings - Sakshi

దుబాయ్‌: ఇంగ్లండ్‌కు 2–1తో సిరీస్‌ను కోల్పోయాక కూడా ఆస్ట్రేలియా జట్టు టాప్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించిన టి20 ర్యాంకుల్లో ఆస్ట్రేలియా (275 పాయింట్లు), ఇంగ్లండ్‌ (271 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నాయి. భారత్‌ 266 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. బ్యాట్స్‌మెన్‌ కేటగిరీలో పాకిస్తాన్‌ స్టార్‌ ప్లేయర్‌ బాబర్‌ ఆజమ్‌ తొలి స్థానాన్ని ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలాన్‌కు కోల్పోయాడు. ఆసీస్‌తో సిరీస్‌లో 129 పరుగులతో టాపర్‌గా నిలిచిన 33 ఏళ్ల మలాన్‌ మూడు స్థానాలు ఎగబాకి నంబర్‌వన్‌ ర్యాంకుకు చేరుకున్నాడు. బాబర్‌ ఆజమ్, ఆరోన్‌ ఫించ్‌ (ఆస్ట్రేలియా) వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉండగా... భారత ప్లేయర్‌ లోకేశ్‌ రాహుల్‌ రెండు స్థానాలు దిగజారి నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. (చదవండి: మనీశ్‌ పాండే ఎంతో కీలకం)

ఆసీస్‌కు ఊరట విజయం
సౌతాంప్టన్‌: వరుసగా తొలి రెండు టి20 మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ చేజార్చుకున్న ఆస్ట్రేలియా జట్టుకు ఊరట విజయం దక్కింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన ఇంగ్లండ్‌ 2–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య ఈనెల 11న, 13న, 16న వరుసగా మూడు వన్డేలు జరుగుతాయి. చేతి వేలి గాయం కారణంగా ఇంగ్లండ్‌ టి20 జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండటంతో ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (44 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... డేవిడ్‌ మలాన్‌ (21; 3 ఫోర్లు), మొయిన్‌ అలీ (23; 2 ఫోర్లు, సిక్స్‌), డెన్లీ (29 నాటౌట్‌; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా రెండు వికెట్లు తీయగా... స్టార్క్, హాజెల్‌వుడ్, రిచర్డ్‌సన్, అగర్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. అనంతరం ఆస్ట్రేలియా 19.3 ఓ వర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసి గెలిచింది. ఒకదశలో 100 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాలో పడినట్లు కనిపించిన ఆసీస్‌ జట్టును మిచెల్‌ మార్‌‡్ష (36 బంతుల్లో 39 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌), అగర్‌ (16 నాటౌట్‌) విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 46 పరుగులు జోడించారు. అంతకుముందు కెప్టెన్‌ ఫించ్‌ (26 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్‌) దూకుడైన ఇన్నింగ్స్‌ ఆడాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top