ఏఐటీఏ ఎన్నికల బరిలో మహేశ్‌ భూపతి, సానియా మీర్జా | Mahesh Bhupathi and Sania Mirza in the fray for AITA elections | Sakshi
Sakshi News home page

ఏఐటీఏ ఎన్నికల బరిలో మహేశ్‌ భూపతి, సానియా మీర్జా

Oct 26 2026 3:51 AM | Updated on Oct 26 2026 3:51 AM

Mahesh Bhupathi and Sania Mirza in the fray for AITA elections

అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలిగిన పేస్‌  

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ దిగ్గజాలు మహేశ్‌ భూపతి, సానియా మీర్జా అఖిల భారత టెన్నిస్‌ అసోసియేఏషన్‌ (ఏఐటీఏ) స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ అవుట్‌ స్టాండింగ్‌ మెరిట్‌ (ఎస్‌ఓఎం) ఎన్నికల బరిలోకి దిగనున్నారు. జనరల్‌ బాడీ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీల్లో ప్రాతినిధ్యం కోసం ఈ ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. టెన్నిస్‌ పురుషుల డబుల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ఆటగాడైన మహేశ్‌ భూపతి అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘకాలం దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇక మహిళల డబుల్స్‌లో వరల్డ్‌ మాజీ నంబర్‌వన్‌ అయిన సానియా మీర్జా ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలుచుకుంది. 

మరో దిగ్గజ ఆటగాడు లియాండర్‌ పేస్‌ దరఖాస్తు చేయలేదు. దీంతో ‘ఏఐటీఏ’ అధ్యక్ష పదవికి అతడు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం బెంగాల్‌ టెన్నిస్‌ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్న పేస్‌... రాష్ట్ర ప్రతినిధిగా పోటీ చేయడానికి అనర్హుడు కావడంతోనే నామినేషన్‌కు దూరమైనట్లు సమాచారం. నిబంధనల ప్రకారం జాతీయ సంస్థలో ఒక పదవికి పోటీ చేయడానికి... రాష్ట్ర సంఘంలో కార్యనిర్వాహక పదవిలో కనీసం ఒక పర్యాయం పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో బెంగాల్‌ ప్రతినిధిగా ఏఐటీఏ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం పేస్‌కు ఉంది కానీ... జాతీయ క్రీడా పరిపాలన (ఎన్‌ఎస్‌జీ) చట్టం ప్రకారం పోటీ చేయడానికి మాత్రం పేస్‌కు అర్హతలేదు.

‘క్రీడల్లో పరివర్తన తీసుకురావడానికి ప్రతి సమాఖ్యకు అత్యున్నత స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు అవసరం. బ్యాడ్మింటన్‌కు పుల్లెల గోపీచంద్‌ చేసిన సేవ విప్లవాత్మకమైంది. అన్ని క్రీడల్లో ఇలాంటి ఉదాహరణలు ఉండాలి’ అని మహేశ్‌ భూపతి వెల్లడించాడు. సానియా మీర్జా, మహేశ్‌ భూపతితో పాటు మరో ఆరుగురు మాజీ క్రీడాకారులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో అంకిత బాంబ్రీ, ప్రస్తుత డేవిస్‌ కప్‌ కోచ్‌ అశుతోష్‌ సింగ్, గౌరవ్‌ నటేకర్, జానకి కృష్ణమూర్తి, శాలిని ఠాకూర్‌ చావ్లా, ప్రస్తుత బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ విశాల్‌ ఉప్పల్‌ ఉన్నారు. 

ఇందులో మహేశ్‌ భూపతి, సానియా మీర్జా, అంకిత బాంబ్రీ, జానకి కృష్ణమూర్తి, విశాల్‌ ఉప్పల్‌ కార్యనిర్వాహక కమిటీ జాబితాలో పోటీపడుతున్నారు. ఏఐటీఏ సవరించిన నియమావళి ప్రకారం జనరల్‌ బాడీలో నలుగురు స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ అవుట్‌ స్టాండింగ్‌ మెరిట్‌ (ఎస్‌ఓఎం) ప్రతినిధులు ఉంటారు. ఇందులో ఇద్దురు పురుషులు, ఇద్దరు మహిళలకు అవకాశం లభిస్తుంది. ఇక 15 మంది సభ్యుల కార్యనిర్వాహక కమిటీలో ఇద్దరు స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ అవుట్‌స్టాండింగ్‌ మెరిట్‌ ప్రతినిధులు ఉంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement