ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్ వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకుంటున్నారు
ఇదంతా పోలీసులు, ఎన్నికల అధికారుల పూర్తి సమక్షంలో జరుగుతోంది
అభ్యర్థుల భద్రత, ఎన్నికల్లో పోటీచేసే వారి హక్కు, ప్రజాస్వామ్య ప్రక్రియను రక్షించడంలో పోలీసుల పాత్రపై ఆందోళన కలుగుతోంద
నామినేషన్ల అడ్డగింతపై జాతీయ స్థాయిలో దుమారం
మహిళా అభ్యర్థుల పత్రాలు లాక్కుంటున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు
చంద్రబాబు పాలనపై జాతీయ స్థాయిలో ప్రముఖుల మండిపాటు
సామాజిక మాధ్యమాల్లో టీడీపీ అక్రమాలు, దౌర్జన్యాల వీడియోలు పోస్ట్ చేస్తూ విమర్శలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందంటూ జాతీయ స్థాయిలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, మహిళా అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కుంటున్నారని, పోలీసుల సమక్షంలోనే ఈ ఘటనలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామాలపై జాతీయ స్థాయిలో ప్రముఖ జర్నలిస్టులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలో ఎన్నికల స్వేచ్ఛ, అభ్యర్థుల భద్రత, పోలీసుల నిష్పాక్షికతపై వారు ఆందోళన వ్యక్తంచేస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు.
ప్రజాస్వామ్యం ఉందా?..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ స్వతంత్ర జర్నలిస్టు ప్రశాంత్ కనోజియా తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీల ‘ఆటవిక రాజ్యం’ నడుస్తోందని విమర్శిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం లేదనేలా పరిస్థితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది..
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది అసాధారణమైనది. అధికార టీడీపీ గూండాలు ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్ పత్రాలు దాఖలు చేయకుండా నిర్మొహమాటంగా అడ్డుకుంటున్నారు. ఇదంతా పోలీసులు, ఎన్నికల అధికారుల పూర్తి సమక్షంలో, వారి కుమ్మక్కుతో జరుగుతోంది. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది’’.. అని తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఆయన పేర్కొన్నారు.

మహిళా అభ్యర్థులపై దౌర్జన్యాలా?..
మహిళా అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆరోపణలపై అఖిల భారత మహిళా కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ‘‘ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యంపై బహిరంగంగా దాడి జరుగుతోంది. అధికార పార్టీ గూండాలు మహిళా అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను హింసాత్మకంగా లాక్కుంటున్నారు. ఇది సిగ్గుచేటు.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’.. అంటూ ఖండించింది.

ప్రతిపక్ష రాష్ట్రంలో జరిగితే ప్రత్యక్ష ప్రసారం చేసేవారు..
సామాజిక మాధ్యమ వినియోగదారు నమ్ర పటేల్ రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితులపై విమర్శలు గుప్పించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు భారత ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా మారాయి. నారా చంద్రబాబునాయుడు పాలనలో ఏపీలో పూర్తిగా చట్టం అదుపు తప్పింది. ఇదే ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రంలో జరిగి ఉంటే ప్రధాన వార్తా మాధ్యమాలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసి ఉండేవి’’.. అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల హింసపై జర్నలిస్టుల ఆందోళన..
జర్నలిస్టులు అనుషా రవి సూద్, సందీప్ మనుధనే సహా పలువురు సామాజిక మాధ్యమ వినియోగదారులు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా హింస చోటుచేసుకుంటోందని ఆరోపించారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రజాస్వామ్యం క్షీణిస్తోంది..
ఫ్రాన్సెస్కో ఫాచిని భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పందించారు. ‘‘దక్షిణ భారత రాష్ట్రాల్లో ఒకదానిలో ఎన్నికల ప్రక్రియల సమయంలో జరిగిన భారీ ఎన్నికల అవకతవకలను నా సహోద్యోగి, స్నేహితుడు ఇక్కడ చాలా చక్కగా వివరించారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇటువంటి బెదిరింపులను ఎదుర్కొంటున్న ఆయనకు, ప్రజలందరికీ నేను మద్దతుగా నిలుస్తున్నాను’’.. అని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు చూస్తున్నాయా?..
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ అయితే ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టును ఉద్దేశించి ప్రశ్నలు సంధించారు. ‘‘ఎన్నికల సంఘం చూస్తోందా? సుప్రీంకోర్టు చూస్తోందా? అని నిలదీశారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు ఘటనపై శ్వేతా సోని స్పందించారు. ‘‘గ్రేట్ ఏపీ పోలీస్!’’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒక గుంపు మహిళ నామినేషన్ పత్రాలను లాక్కుంటున్న సమయంలో పోలీసులు చూస్తూ నిలబడ్డారని విమర్శించారు.

13 జిల్లాల్లో 31 ఎన్నికల ఘటనలు..
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో అక్టోబర్ 22న నామినేషన్ దాఖలు చేయడానికి ప్రయత్నిస్తున్న మహిళ నుంచి ఒక వ్యక్తి పత్రాలను లాక్కోవడానికి ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తోందని ‘నేషనల్ హెరాల్డ్’ కథనం పేర్కొంది. నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చింపివేయడం, ధ్వంసం చేయడం వంటి ఘటనలకు సంబంధించి 13 జిల్లాల్లో 31 ఎన్నికల సంబంధిత సంఘటనలు నమోదైనట్లు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపింది. ఈ ఘటనలు అభ్యర్థుల భద్రత, ఎన్నికల్లో పోటీచేసే హక్కు, పోలీసుల బాధ్యతపై ఆందోళనలను పెంచాయని పేర్కొంది.

ఎన్నికల సంఘం ఏం చేస్తోంది?..
నామినేషన్ల దాఖలుకు అడ్డంకులు లేకుండా చూడటం, అభ్యర్థుల భద్రతను కాపాడటం ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం బాధ్యత. నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చింపివేయడం వంటి ఘటనలపై ఫిర్యాదులు వస్తే నిష్పాక్షికంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీకి చెందిన వారిపై ఆరోపణలు వచ్చినా, ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా చట్టం ముందు అందరూ సమానమే. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై జాతీయ స్థాయిలో విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి పోటీచేసే హక్కును కాపాడినప్పుడే ఎన్నికలపై ప్రజలకు విశ్వాసం నిలుస్తుందని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.


