రైజర్స్‌ గాడిన పడేనా! | Lucknow Super Giants vs Sunrisers Hyderabad 61st Match | Sakshi
Sakshi News home page

రైజర్స్‌ గాడిన పడేనా!

May 19 2025 4:39 AM | Updated on May 19 2025 4:39 AM

Lucknow Super Giants vs Sunrisers Hyderabad 61st Match

నేడు లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌

లక్నో: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ 18వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టు నామమాత్రమైన పోరుకు సిద్ధమైంది. సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ)తో రైజర్స్‌ తలపడనుంది. ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్‌’ రేసు నుంచి తప్పుకున్న గత సీజన్‌ రన్నరప్‌ సన్‌రైజర్స్‌... మెరుగైన స్థానంతో ఈ సీజన్‌కు ముగింపు పలకాలని భావిస్తోంటే... పడుతూ లేస్తూ సాగుతున్న లక్నో జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలని తహతహలాడుతోంది.

 రిషభ్‌ పంత్‌ సారథ్యంలోని లక్నో జట్టు గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడింది. ఈ నేపథ్యంలో తెగించి పోరాడేందుకు రెడీ అవుతోంది. పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న లక్నో సారథి పంత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అనుకోని విరామం తర్వాతైనా పంత్‌ విజృంభిస్తాడా చూడాలి. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన లక్నో 5 విజయాలు, 6 పరాజయాలతో 10 పాయింట్లతో ఉంది. మరోవైపు ‘ఆరెంజ్‌ ఆర్మీ’ 11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 7 ఓటములు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో 7 పాయింట్లతో ఉంది.  

బౌలింగ్‌ మెరుగైతేనే! 
తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి ప్రత్యర్థులను హడలెత్తించిన సన్‌రైజర్స్‌ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేక పరాజయాలతో సహవాసం చేసింది. ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్న కమిన్స్‌ బృందం... ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అయినా కాస్త మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. గతేడాది ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌’ అవార్డు గెలుచుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఈసారి పేలవ ప్రదర్శన చేస్తుంటే... తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఇషాన్‌ కిషన్‌ ఆ తర్వాత జట్టుకే భారంగా మారాడు. 

అభిషేక్‌ శర్మ అడపాదడపా మెరుపులు తప్ప నిలకడలేమితో ఇబ్బంది పడుతుంటే... సీజన్‌లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన ట్రావిస్‌ హెడ్‌ కోవిడ్‌–19 సోకడంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో అభిషేక్‌తో కలిసి ఇషాన్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా... సచిన్‌ బేబీకి తుది జట్టులో చోటు దక్కనుంది. మిడిలార్డర్‌లో క్లాసెన్, నితీశ్, అనికేత్, మెండిస్‌ కీలకం కానున్నారు. ఇక ఈ సీజన్‌లో లయ దొరకబుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న టీమిండియా పేసర్‌ మొహమ్మద్‌ షమీతో పాటు కమిన్స్, ఉనాద్కట్‌ బౌలింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరముంది.  

పంత్‌పైనే అందరి చూపు 
పది రోజుల విరామం తర్వాత బరిలోకి దిగుతున్న లక్నో జట్టు పంత్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో ఆరుసార్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన పంత్‌... 12.8 సగటుతో 128 పరుగులు చేశాడు. కనీసం 100 బంతులు ఎదుర్కొన్న వారిలో పంత్‌దే అతితక్కువ సగటు, స్ట్రయిక్‌ రేట్‌. ఈ గణాంకాలు చాలు ఈ సీజన్‌లో పంత్‌ ఎంతలా తడబడుతున్నాడో అర్థం చేసుకునేందుకు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అయితే అబ్దుల్‌ సమద్, ఆయుశ్‌ బదోనీ తర్వాత ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్సీ రేసులో ముందు వరసలో ఉన్న పంత్‌ ఈ మ్యాచ్‌లోనైనా చెలరేగుతాడా చూడాలి. మార్క్‌రమ్, మార్‌‡్ష, పూరన్, మిల్లర్‌ రూపంలో నలుగురు భీకర బ్యాటర్లు లక్నోకు అందుబాటులో ఉండగా... మిల్లర్‌ ఫామ్‌లేమీ మేనేజ్‌మెంట్‌ను ఇబ్బంది పెడుతోంది. బౌలింగ్‌లో లక్నో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆరంభంలో మెరిపించిన శార్దుల్‌ ఠాకూర్‌ ప్రభావం చూపలేకపోతుండగా... మయాంక్‌ యాదవ్‌ గాయాలతో సతమతమవుతున్నాడు. విఘ్నేశ్‌ రాఠీ, ప్రిన్స్‌ యాదవ్, అవేశ్‌ ఖాన్‌ కలసి కట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. 

తుది జట్లు (అంచనా) 
లక్నో సూపర్‌ జెయింట్స్‌: పంత్‌ (కెప్టెన్‌), మార్క్‌రమ్, మార్‌‡్ష, పూరన్, బదోని, మిల్లర్, సమద్, రవి బిష్ణోయ్, శార్దుల్‌ ఠాకూర్, విగ్నేశ్‌ రాఠీ, ప్రిన్స్‌ యాదవ్, అవేశ్‌ ఖాన్‌. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: కమిన్స్‌ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, అభిషేక్‌ శర్మ, సచిన్‌ బేబీ, క్లాసెన్, నితీశ్‌ రెడ్డి, అనికేత్‌ వర్మ, కమిందు మెండిస్, ఉనాద్కట్, హర్శల్‌ పటేల్, షమీ, జీషాన్‌ అన్సారీ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement