
LSG (File Photo), Pc: Ipl/bcci
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంత్ టీమ్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.
లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), మార్‌క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.
అభిషేక్ శర్మ విధ్వంసం..
అనంతరం 206 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్లాసెన్(47), ఇషాన్ కిషన్(35), మెండిస్(32) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ సింగ్ రెండు, విలియం ఓ రూర్క్ వికెట్ సాధించారు.