క్రికెట్‌కు సంబంధించి ఏ జట్టుకైనా ఐసీసీ టోర్నీల్లో పాల్గొనడమనేది చాలా ముఖ్యం. కేవలం మైదానంలో లభించే గుర్తింపు కోసమే కాకుండా, ఆదాయాన్ని సమీకరించుకునే విషయంలోనూ ఇది చాలా కీలకం. అందుకే ప్రతి జట్టు ఐసీసీ టోర్నీల్లో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
అయితే, క్రికెట్ చరిత్రలో కొన్ని జట్లు ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు నిరాకరించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా బంగ్లాదేశ్ చేరింది. ఈ జట్టు త్వరలో జరుగబోయే టీ20 ప్రపంచ కప్ నుండి వైదొలిగింది. ఈ నేపథ్యంలో గతంలో ఐసీసీ ఈవెంట్లను బహిష్కరించిన జట్లపై ఓ లుక్కేద్దాం.
చరిత్ర చూస్తే.. రాజకీయ కారణాలు, భద్రతా సమస్యలు లేదా అంతర్జాతీయ సంబంధాల కారణంగా కొన్ని జట్లు ఐసీసీ టోర్నీలను బహిష్కరించాయి. ఇందులో ముందుగా జింబాబ్వే పేరు వస్తుంది.
జింబాబ్వే రాజకీయ ఉద్రిక్తతలు, ఆటగాళ్లకు వీసా సమస్యల కారణంగా ఇంగ్లండ్‌లో జరిగిన 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20ని (అప్పట్లో టీ20 ప్రపంచకప్‌ను అలా పిలిచేవారు) బహిష్కరించింది.
జింబాబ్వే ఇలా చేయడానికి బీజం 2003లో పడింది. ఆయేడు జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జింబాబ్వేలో ఆడటానికి నిరాకరించింది. ఇందుకు కారణం నాటి జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేతో యూకేకు ఉండిన రాజకీయ విభేదాలు.
అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపడకపోవడంతో జింబాబ్వే 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంది. జింబాబ్వేకు ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్‌కు టీ20 ప్రపంచకప్ బెర్త్ దక్కింది.
ఇలాంటి ఉదంతమే 2016 అండర్ 19 వరల్డ్‌కప్‌లోనూ జరిగింది. ఆయేడు బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా వైదొలిగింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ యువ ఆసీస్ జట్టు మెగా టోర్నీని బహిష్కరించింది. అప్పుడు ఆసీస్‌కు ప్రత్యామ్నాయంగా ఐర్లాండ్‌కు అవకాశం లభించింది.
పై రెండు ఉదంతాల తర్వాత ఓ జట్టు ఐసీసీ టోర్నీ మొత్తాన్నే బహిష్కరించడం ఇదే ఏడాది జరిగింది. రాజకీయ ఉద్రిక్తతలు, ఐపీఎల్ 2026లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ తొలగింపు, భద్రతా కారణాల చేత భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. దీంతో ఆ జట్టుకు ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్‌కు ప్రపంచకప్ బెర్త్ దక్కింది.
పైన పేర్కొన్న ఉదంతాల్లో ఆయా జట్లు ఐసీసీ టోర్నీ మొత్తాన్నే రద్దు చేసుకోగా.. కొన్ని జట్లు పలు మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి.
1996 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకలో జరగాల్సిన మ్యాచ్‌లను ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు బాయ్‌కాట్ చేశాయి. లంకలో అంతర్యుద్దం, భద్రతా కారణాల చేత ఆ జట్లు తమ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను రద్దు చేసుకున్నాయి. దీంతో శ్రీలంకకు వాకోవర్ లభించింది. ఆ టోర్నీలో శ్రీలంకనే ఛాంపియన్‌గా నిలవడం కొసమెరుపు.
2003 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు కూడా ఓ మ్యాచ్‌ను ఆడేందుకు నిరాకరించింది. ఆయేడు ప్రపంచకప్ టోర్నీకి జింబాబ్వేతో పాటు కెన్యా కూడా ఆతిథ్యమిచ్చింది. మెగా టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ నైరోబీలో ఓ మ్యాచ్ ఆడాల్సి ఉండింది. ఈ మ్యాచ్‌ను భద్రతా కారణాల చేత న్యూజిలాండ్ బాయ్‌కాట్ చేయాలనుకుంది.


