దక్షిణాఫ్రికాను గెలిపించిన లిజెల్‌ లీ

Liezel Lee will win South Africa by 3 runs and win by six runs - Sakshi

మూడో వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి

లక్నో: ఓపెనర్‌ లిజెల్‌ లీ (131 బంతుల్లో 132 నాటౌట్‌; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేయడంతో... భారత మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 46.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 223 పరుగులు చేసిన దశలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది.

డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా విజయం ఖాయం కావాలంటే అప్పటికి ఆ జట్టు స్కోరు 217 పరుగులుగా ఉండాలి. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి అంచనా స్కోరుకంటే దక్షిణాఫ్రికా ఎక్కువే చేయడంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు. లిజెల్‌ లీ మూడో వికెట్‌కు మెగ్నాన్‌ డు ప్రీజ్‌ (37; 2 ఫోర్లు, సిక్స్‌)తో కలిసి 97 పరుగులు... ఐదో వికెట్‌కు ఆనీ బాష్‌ (16 నాటౌట్‌)తో కలిసి అజేయంగా 45 పరుగులు జోడించింది. అంతకుముందు భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లకు 248 పరుగులు సాధించింది. పూనమ్‌ రౌత్‌ (77; 11 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. మిథాలీ రాజ్‌ (36; 5 ఫోర్లు), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (36; 4 ఫోర్లు, సిక్స్‌), దీప్తి శర్మ (36 నాటౌట్‌; 2 ఫోర్లు) రాణించారు.  

మిథాలీ @ 10,000
భారత జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఈ మ్యాచ్‌ ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో (మూడు ఫార్మాట్‌లు కలిపి) 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా, భారత్‌ నుంచి తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఆనీ బాష్‌ బౌలింగ్‌లో బౌండరీ సాధించడంతో మిథాలీ రాజ్‌ ఈ మైలురాయిని చేరుకుంది. తర్వాతి బంతికే మిథాలీ అవు టైంది. 22 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో మిథాలీ 10 టెస్టుల్లో 663 పరుగులు... 212 వన్డేల్లో 6,974 పరుగులు... 89 టి20ల్లో 2,364 పరుగులు సాధించింది. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ రిటైర్డ్‌ క్రికెటర్‌ చార్లోటి ఎడ్వర్డ్స్‌ (10,273 పరుగులు) టాప్‌ ర్యాంక్‌లో ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top