రాయల్‌ లండన్‌ వన్డే కప్‌-2023 విజేతగా లీసెస్టర్‌షైర్‌

Leicestershire Win Maiden England Domestic One Day Cup By Beating Hampshire In The Final - Sakshi

ఇంగ్లండ్‌ దేశవాలీ వన్డే కప్‌ అయిన రాయల్‌ లండన్‌ వన్డే కప్‌-2023ను లీసెస్టర్‌షైర్‌ ఎగరేసుకుపోయింది. నిన్న (సెప్టెంబర్‌ 16) జరిగిన ఫైనల్లో ఆ జట్టు.. హ్యాంప్‌షైర్‌ను 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడించి, తొలిసారి దేశవాలీ వన్డే ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లీసెస్టర్‌షైర్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది.

ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌.. అజేయ శతకంతో విజృంభణ
ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు వికెట్‌కీపర్‌ హ్యారీ స్విండెల్స్‌ లిస్ట్‌-ఏ కెరీర్‌లో తొలి శతకంతో విజృంభించాడు. 96 బంతులు ఎదుర్కొన్న స్విండెల్స్‌ 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 117 పరుగులు చేసి, తన జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ సాధించేందుకు తోడ్పడ్డాడు. స్విండెల్స్‌కు శ్యామ్యూల్‌ ఈవాన్స్‌ (60), కెప్టెన్‌ లివిస్‌ హిల్‌ (42) సహకరించారు. హ్యాంప్‌షైర్‌ బౌలర్లలో బార్కర్‌, మేసన్‌ క్రేన్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. హోలండ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్‌ గెలుపు కోసం కడదాకా పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు ఆడి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవరల్లో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 265 పరుగులకు పరిమితమైంది. టామ్‌ ప్రెస్ట్‌ (51), లియామ్‌ డాసన్‌ (57) అర్ధసెంచరీలతో రాణించి, హ్యాంప్‌షైర్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. వీరికి బెన్‌ బ్రౌన్‌ (33), జో వెదర్లీ (40) సహకరించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. లీసెస్టర్‌షైర్‌ బౌలర్లలో ముల్దర్‌, క్రిస్‌ రైట్‌, జోష్‌ హల్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కొలిన్‌ అకెర్‌మ్యాన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top