
తిలక్ వర్మ
హైదరాబాద్: కౌంటీ క్రికెట్‌లో హాంప్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్లు టీమిండియా ప్లేయర్, హైదరాబాదీ క్రికెటర్ ఠాకూర్ తిలక్‌వర్మ పేర్కొన్నాడు. అక్కడ నేర్చుకున్న పాఠాలు... జీవిత కాలం పాటించనున్నట్లు వెల్లడించాడు. భారత జాతీయ జట్టు తరఫున 4 వన్డేలు, 25 టి20లు ఆడిన తిలక్ వర్మ... ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.
‘కెరీర్ ప్రారంభించిన సమయంలో ఏదో ఒక రోజు కౌంటీ క్రికెట్ ఆడాలనుకున్నా. నా కల ఇప్పుడు నెరవేరింది. ఈ ఏడాది హాంప్‌షైర్ తరఫున కౌంటీ అరంగేట్రం చేయడం ఆనందంగా ఉంది. సుదీర్ఘ ఫార్మాట్‌తో పాటు, పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు సైతం ఆడాను. కేవలం ఆటలోనే కాకుండా వ్యక్తిగతంగానూ ఎన్నో విషయాలు నేర్చుకున్నా. వాటిని కెరీర్ ఆసాంతం అనుసరిస్తా. హాంప్‌షైర్ యాజమాన్యానికి ధన్యవాదాలు’ అని తిలక్ వర్మ గురువారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
ఈ సీజన్‌లో హాంప్‌షైర్ తరఫున మొత్తం 7 మ్యాచ్‌లాడిన తిలక్ 412 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 2 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. తన బౌలింగ్‌తో ఒక వికెట్ కూడా పడగొట్టాడు. మరోవైపు హాంప్‌షైర్ కూడా తిలక్‌పై ప్రశంసలు కురిపించింది. ‘సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడి తొలి శతకం హాంప్‌షైర్ జట్టు తరఫున నమోదైంది. మేం అంచనా వేసిన దానికంటే అతడు ఎంతో మెరుగ్గా ఆడాడు, తిలక్‌లో అపార ప్రతిభ ఉంది. గణాంకాలు పక్కనపెడితే అతడు జట్టుకు చేకూర్చిన బలం వెలకట్టలేనిది’ అని హాంప్‌షైర్ క్లబ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో తిలక్ వర్మ సౌత్ జోన్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ నెల 28 నుంచి బెంగళూరు వేదికగా జరగనున్న ఈ జోనల్ టోరీ్నతో దేశవాళీ సీజన్ ప్రారంభం కానుంది. వచ్చే నెల యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) వేదికగా జరగనున్న ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో బరిలోకి దిగే భారత జట్టులో తిలక్‌కు చోటు దక్కడం దాదాపు ఖాయమే!