విజేత లలిత్‌ | Lalit Babu MR and Madhesh Kumar S are the Champions of Aurionpro Mumbai International GM Open | Sakshi
Sakshi News home page

విజేత లలిత్‌

Jun 25 2025 4:01 AM | Updated on Jun 25 2025 4:01 AM

Lalit Babu MR and Madhesh Kumar S are the Champions of Aurionpro Mumbai International GM Open

ముంబై: ఆరియన్‌ప్రొ ముంబై ఓపెన్‌ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ముసునూరి రోహిత్‌ (ఎంఆర్‌) లలిత్‌ బాబు చాంపియన్‌గా అవతరించాడు. మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 32 ఏళ్ల లలిత్‌ బాబు ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. లలిత్‌తోపాటు అర్మేనియాకు చెందిన మామికోన్‌ ఘరిబియాన్‌ కూడా 8 పాయింట్లు సంపాదించాడు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా విజేతను నిర్ణయించగా... లలిత్‌ బాబుకు టైటిల్‌ ఖరారైంది. 

150 మంది ప్లేయర్ల మధ్య స్విస్‌ ఫార్మాట్‌లో తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో లలిత్‌ బాబు ఏడు గేముల్లో గెలిచి, మరో రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో నల్ల పావులతో ఆడిన లలిత్‌ 72 ఎత్తుల్లో జార్జియా గ్రాండ్‌మాస్టర్‌ లెవాన్‌ పాంట్‌సులయపై గెలుపొందాడు. 

2012లో భారత 26వ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం)గా అవతరించిన లలిత్‌ బాబు 2014 చెస్‌ ఒలింపియాడ్‌లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కామన్వెల్త్‌ చాంపియన్‌గా నిలిచిన లలిత్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం కూడా సాధించాడు. ఓవరాల్‌గా లలిత్‌ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 20 స్వర్ణాలు, 15 రజతాలు, 14 కాంస్య పతకాలు సాధించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement