Photo Credit: BCCI Twitter
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వన్డే కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. కీమో పాల్‌ను ఔట్ చేయడం ద్వారా కుల్దీప్ యాదవ్ వన్డేల్లో 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. భారత క్రికెట్‌లో ఇప్పటివరకు తొమ్మిది మంది బౌలర్లు మాత్రమే ఈ సంఖ్యను వారిలో స్పిన్ బౌలర్లలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా మాత్రమే ఈ ఘనత సాధించారు. తాజాగా కుల్దీప్ యాదవ్ వీరి సరసన చేరాడు.
కుల్దీప్ ఇప్పటివరకు 123 వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్ సగటు 26.70గా ఉంది. కెరీర్‌లో 10 సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. రెండు సందర్భాల్లో 5 వికెట్ల ఘనత సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 6/25గా ఉన్నాయి. భారత వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుల్దీప్ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
ఈ జాబితాలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్పిన్నర్లలో కుంబ్లే 269 వన్డేల్లో 334 వికెట్లు సాధించగా, హర్భజన్ సింగ్ 265 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా, రవీంద్ర జడేజా 232 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఓవరాల్ జాబితాలో కుంబ్లే తర్వాత శ్రీనాథ్ (315 వికెట్లు), అగార్కర్ (288 వికెట్లు), జహీర్ ఖాన్ (269 వికెట్లు), హర్భజన్ సింగ్ (265 వికెట్లు), కపిల్ దేవ్ (253 వికెట్లు), జడేజా (232 వికెట్లు), షమీ (206 వికెట్లు) ఉన్నారు.
ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ మరో రికార్డు కూడా అందుకున్నాడు. అతి తక్కువ వన్డేల్లో 200 వికెట్ల మార్క్ చేరుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. కుల్దీప్ 123 వన్డేల్లో ఈ ఫీట్ అందుకోగా, షమీ 104 వన్డేల్లో 200 వికెట్ల మార్క్ చేరుకొని తొలి స్థానంలో ఉన్నాడు. అజిత్ అగార్కర్ 133 వన్డేల్లో, జహార్ ఖాన్ 144 వన్డేల్లో 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్నారు.
ఇదీ చదవండి: శతకాలతో విండీస్ బ్యాటర్ల విధ్వంసం.. భారత్ టార్గెట్ 406 రన్స్


