కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో వెనకంజలో నిలిచింది. అయితే తొలి టెస్టు జరిగిన ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.
ఇటువంటి పిచ్‌లు వల్ల టెస్టు క్రికెట్ అంతరించిపోతుందని భారత మాజీ స్పిన్నర్ హార్బజన్ సింగ్ మండిపడ్డాడు. భజ్జీ ఒక్కడే కాదు చాలా మంది మాజీ క్రికెటర్లు ఈడెన్ పిచ్‌పై విమర్శలు గుప్పించారు. అయితే భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను సమర్ధించాడు.
పిచ్‌లో భూతాలు ఏమి లేవని, మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటే పరుగులు సాధించవచ్చని గంభీర్ అన్నాడు. అంతేకాకుండా తామే ఇటువంటి పిచ్ కావాలని కోరుకున్నట్లు అతడు తెలిపాడు.అయితే పిచ్‌ను సమర్ధించిన గౌతమ్ గంభీర్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైరయ్యాడు. అస్సలు టెస్టు క్రికెట్‌కు సరిపోయే పిచ్ కాదు అని శ్రీకాంత్ అన్నాడు.
"సొంత గడ్డపై మనకు ఘోర పరాభావం ఎదురైంది. పూర్తి స్దాయి జట్టుతో ఆడుతున్నప్పటికి టీమిండియా ఇంత దారుణ ఓటమిని ఎదుర్కొవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. గంభీర్ ఇటువంటి పిచ్ కావాలని క్యూరేటర్‌ను అడిగాడు. వికెట్ ప్రవర్తించిన తీరును చూసిన తర్వాత కూడా అతడు తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నాడు.
ఇది అస్సలు టెస్టు క్రికెట్‌కు సరిపోయే పిచ్ కాదు. మొదటి రోజు నుంచే పిచ్‌లో టర్న్ ఎక్కువగా ఉంది. ఇప్పుడే కాదు చాలా ఏళ్లుగా ఇదే తప్పు చేస్తున్నాం. టర్నింగ్ పిచ్‌లు కావాలని అడుగుతున్నాము. కానీ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. ఇదొక చెత్త ట్రాక్. ఇటువంటి వికెట్‌పై ఆటగాళ్లు మంచి టెక్నిక్‌తో ఆడాలని గంభీర్ చెప్పడం సరికాదు. నేను బౌలింగ్ చేసినా కూడా ఓ వికెట్ వచ్చి ఉండేది.
రెండు జట్లలో ఒక టీమ్ కూడా 200 పరుగుల మార్క్ దాటకపోతే.. అదెలా మంచి వికెట్ అవుతుంది? గంభీర్ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడు. ప్రతీ ఒక్క బ్యాటర్ ఈ వికెట్‌పై కష్టపడి ఆడాడు. రెండు జట్లు కూడా ఇబ్బంది పడ్డాయి. గంభీర్ ఒత్తిడిలో ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ, భారత జట్టు మాత్రం ఒత్తిడిలో ఉంది” అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే


