
హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి
Virat Kohli And Rohit Sharma’s T20I Career To End?: ‘‘భవిష్యత్ ప్రణాళికల గురించి ఆటగాళ్లతో చర్చించడం చీఫ్ సెలక్టర్ ముఖ్య విధుల్లో ఒకటి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందుకు అతీతులు కారు. వాళ్లు కోరుకుంటే సుదీర్ఘకాలం పాటు జట్టులో కొనసాగవచ్చు. అయితే, ఎంతటి గొప్ప ఆటగాళ్లైనా సరే సమయం వచ్చినపుడు సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఆడటంతో పాటు.. ఐపీఎల్ కూడా ఆడటం అంటే అంత తేలికేం కాదు’’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలికి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టీ20 కెరీర్‌ను ఉద్దేశించి ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ నియామకం తర్వాత పొట్టి ఫార్మాట్‌లో వీరిద్దరి భవితవ్యం తేలనుందనే సంకేతాలు ఇచ్చారు.
కోహ్లి అలా.. రోహిత్ ఇలా
కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా వైదొలగగా.. రోహిత్ శర్మ ఆ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో కోహ్లి జట్టులో కేవలం బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. సుదీర్ఘకాలం తర్వాత సెంచరీ కరువు తీర్చుకుంటూ ఆసియా కప్-2022 సందర్భంగా టీ20లలో తొలి శతకం బాదాడు.
ఆ తర్వాత కోహ్లి వెనుదిరిగి చూసుకోలేదు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్‌లో 4 టీ20 సెంచరీలు బాదిన రోహిత్.. ప్రస్తుతం తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను భవిష్యత్ టీ20 కెప్టెన్‌గా ప్రమోట్ చేస్తోంది బీసీసీఐ.
భవిష్యత్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా
ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్-2024 సన్నాహకాల్లో భాగంగా త్వరలోనే హార్దిక్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా చేతన్ శర్మ రాజీనామా నేపథ్యంలో మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.
అజిత్ అగార్కర్ రాగానే
ఇప్పటికే అగార్కర్ చీఫ్ సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోగా.. త్వరలోనే అతడి నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడనుంది. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ సెలక్టర్ రాగానే కోహ్లి, రోహిత్ టీ20 కెరీర్ భవిష్యత్తుపై స్పష్టత రానుందంటూ బీసీసీఐ అధికారి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక వెస్టిండీస్ పర్యటనలోనూ టెస్టు, వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లి, రోహిత్ స్వదేశానికి తిరిగి రానుండగా.. హార్దిక్ టీ20 సిరీస్‌లో జట్టును ముందుకు నడిపించనున్నట్లు సమాచారం.
చదవండి: Test Captain: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి విరాట్ కోహ్లి!?
CWC Qualifiers 2023: నెదర్లాండ్స్ ఆశలు సజీవం