IND Vs ENG: కేఎల్‌ రాహుల్‌.. ఔటైనా రికార్డు సాధించాడు

KL Rahul Become Fourth Indian Batsman Highest Individual Score Lords Test - Sakshi

లార్డ్స్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కేఎల్‌ రాహుల్‌ శతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రికార్డులు సాధించిన రాహుల్‌ తాజాగా రెండో రోజు ఆట ప్రారంభంలోనే ఓలి రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో 129 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. కేఎల్‌ రాహుల్‌ ఔటైనప్పటికి  ఒక రికార్డు అందుకున్నాడు. లార్డ్స్‌ టెస్టులో  భారత్‌ తరపున సెంచరీ సాధించడంతో పాటు అత్యధిక స్కోరు నమోదు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇంతకముందు 1952లో వినూ మన్కడ్‌ (184 పరుగులు), 1982లో దిలీప్‌ వెంగ్‌సర్కార్‌(157 పరుగులు), 1996లో సౌరవ్‌ గంగూలీ(131 పరుగులు) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 

అంతకముందు టెస్టు కెరీర్‌లో ఆరో శతకం చేసిన రాహుల్‌ లార్డ్స్‌ మైదానంలో సెంచరీ సాధించిన మూడో భారత ఓపెనర్‌గా రాహుల్‌ ఘనత సాధించాడు. అంతకుముందు రవిశాస్త్రి(1990), వినోద్‌ మన్కడ్‌(1952)లు మాత్రమే లార్డ్స్‌లో సెంచరీ సాధించిన భారత ఓపెనర్లు కాగా, వారి సరసన ఇప్పుడు రాహుల్‌  చేరిపోయాడు. కాగా, ఆసియా బయట టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి రాహుల్‌ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో సునీల్‌ గావస్కర్‌ 15 సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా, సెహ్వాగ్‌-రాహుల్‌లు తలో నాలుగు సెంచరీలు సాధించారు. ఆ తర్వాత స్థానంలో వినోద్‌ మన్కడ్‌-రవిశాస్త్రిలు తలో మూడు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 96 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top