
క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో తరుణ్ మన్నేపల్లి చేతిలో ఓటమి
బ్యాంకాక్: ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత అగ్రశ్రేణి షట్లర్ కిడాంబి శ్రీకాంత్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు.
మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో తెలంగాణకు చెందిన తరుణ్ మన్నేపల్లి 21–16, 21–19తో శ్రీకాంత్‌ను బోల్తా కొట్టించి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు.అంతకుముందు క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో 23 ఏళ్ల తరుణ్ 17–21, 21–19, 21–17తో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ)పై, 32 ఏళ్ల శ్రీకాంత్ 21–15, 21–17తో శంకర్‌పై గెలుపొందారు. భారత్‌కే చెందిన ఆయుశ్ శెట్టి, ఐరా శర్మ కూడా మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయారు.
క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్‌ల్లో ఆయుశ్ శెట్టి 14–21, 20–22తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో, ఐరా 12–21, 18–21తో థమన్‌వోన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. మిక్స్‌డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో మొహిత్–లక్షిత (భారత్) జోడీ 8–21, 10–21తో ఎన్జీ సాజ్ యావు–చాన్ యిన్ చాక్ (హాంకాంగ్) ద్వయం చేతిలో ఓడింది.