
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో ఎస్సెక్స్ జట్టుతో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలిగాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఖలీల్.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్టుకు గుడ్‌బై చెప్పాడు.
నిరాశకు లోనయ్యాం
ఈ విషయాన్ని ఎస్సెక్స్ (Essex Cricket) యాజమాన్యం సోమవారం ధ్రువీకరించింది. ‘‘వ్యక్తిగత కారణాల వల్ల ఖలీల్ అహ్మద్ తిరిగి స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. క్లబ్‌తో అతడి ఒప్పందం ఇంతటితో ముగిసిపోయినట్లు ప్రకటిస్తున్నాం. అతడు అర్ధంతరంగా జట్టును వీడటం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.
అయితే, ఖలీల్ నిర్ణయాన్ని మేము తప్పక గౌరవిస్తాం. స్వల్పకాలమే జట్టుతో ఉన్నా.. అతడు అందించిన సేవలు మరువలేము. అతడి భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా వెలుగొందాలని ఎస్సెక్స్ క్రికెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు’’ అని క్లబ్ ప్రకటన విడుదల చేసింది.
కాగా మే నెల నుంచి ఖలీల్ అహ్మద్ ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. భారత్-ఎ తరఫున ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడిన జట్టులో అతడు సభ్యుడు. రెండో టెస్టులో ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.
రెండు నెలల ఒప్పందం
అనంతరం గత నెలలో ఎస్సెక్స్ క్రికెట్‌తో ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్, వన్డే కప్ ఆడేందుకు రెండు నెలల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, ఇప్పటికి కౌంటీ చాంపియన్‌షిప్‌లో రెండు మ్యాచ్‌లే ఆడిన ఖలీల్ అహ్మద్.. మరో నాలుగు మ్యాచ్‌లతో పాటు వన్డే కప్‌ఆడాల్సి ఉంది. కానీ.. అంతలోనే అతడు స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది.
కాగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు యజువేంద్ర చహల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, ఖలీల్ అహ్మద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. చహల్ నార్తాంప్టన్‌షైర్‌కు ఆడగా.. రుతురాజ్ యార్క్‌షైర్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఒప్పందం నుంచి తప్పుకొన్నాడు.
మరోవైపు.. ఇషాన్ కిషన్ ఒప్పందం ప్రకారం నాటింగ్‌హామ్‌షైర్‌కు రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇక తిలక్ వర్మ డివిజన్ 2లో భాగంగా హాంప్‌షైర్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడి.. రెండు శతకాలు, ఓ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
చదవండి: IND vs ENG: ‘రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడు’