
కావ్యా మారన్ (Photo Courtesy: BCCI/IPL)
సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మరోసారి బ్యాటింగ్ పవర్ చూపిస్తుందనుకుంటే.. ఆరెంజ్ ఆర్మీకి నిరాశే మిగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో మ్యాచ్.. ఈసారి మూడు వందలు పక్కా అని మురిసిపోయిన అభిమానులు.. రైజర్స్ కనీసం 200 పరుగుల స్కోరు దాటకపోవడంతో ఉసూరుమన్నారు.
ఈసారి బౌలర్లను నమ్ముకుందాం
పర్లేదు.. ఈసారి బౌలర్లను నమ్ముకుందాం.. నామమాత్రపు స్కోరును మన కెప్టెన్ కమిన్స్ మామ, షమీ భయ్యా, హర్షల్ అన్న.. జంపా మావ కాపాడుతారులే అని సరిపెట్టుకున్నారు. కానీ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కట్టడి చేయడంలో వీళ్లంతా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఫలితంగా రైజర్స్ ఓటమిపాలు కాగా.. ఆరెంజ్ ఆర్మీ హృదయం ముక్కలైంది.
లీగ్ మ్యాచ్.. అందులోనూ ఈ సీజన్‌లో రెండోదే అయినప్పటికీ హోం గ్రౌండ్‌లో రైజర్స్.. తమదైన శైలి బ్యాటింగ్‌ను.. ప్రత్యర్థి తమపైనే ప్రయోగించి సఫలం కావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇక ఈ మ్యాచ్ ఆసాంతం అభిమానులు కూడా భావోద్వేగ డోలికల్లో తేలిపోయారు.
కావ్యా మారన్ ఎమోషనల్ రోలర్‌కోస్టర్
ఓసారి సంతోషం.. మరోసారి బాధ.. ఆఖరికి ఓటమి.. ఇలా ప్రతి సమయంలో తమ భావాలను వ్యక్తం చేస్తూ కెమెరాలకు చిక్కారు. సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ (Kavya Maran) కూడా ఇందుకు అతీతం కాదు. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ముగిసేంత వరకు ఆమె హావభావాలను కెమెరా కన్ను ఒడిసిపట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వీక్షకులను ఆకర్షించాయి.
ట్రవిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను లక్నో ఫీల్డర్లు డ్రాప్ చేసినప్పుడు చిన్నపిల్లలా గంతులేసిన కావ్య.. అతడు అవుట్ కాగానే బుంగమూతి పెట్టుకుంది. హెన్రిచ్ క్లాసెన్ రనౌట్ కాగానే ఆమె కోపం కట్టలుతెంచుకుంది. ఇక లక్ష్య ఛేదనలో లక్నో సూపర్‌స్టార్ నికోలస్ పూరన్ పవర్ ప్లేలోనే విశ్వరూపం చూపించడంతో.. కావ్య తీవ్ర నిరాశకు గురైంది.
Kavya maran has more expressions than all bollywood heroines combined 🔥❤️
Kavya maran >>heroines pic.twitter.com/IWzfyIQZI7— Mask 🎭 (@Mr_LoLwa) March 27, 2025
తమ బౌలింగ్‌ను చితక్కొడుతూ పూరన్ ఉప్పల్‌లో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో కావ్య నెత్తికి చేతులు పెట్టుకుంది. సాధారణంగా తమ బ్యాటర్ల నుంచి వచ్చే ఈ పవర్‌ఫుల్ ఇన్నింగ్స్.. ప్రత్యర్థి నుంచి రావడం చూడలేక ముఖం తిప్పేసుకుంది.
అప్పుడు ఇలా ఆనందం
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక గత మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై రైజర్స్ ఘన విజయం సాధించగా.. కావ్యా ఆనందంతో గంతులేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.
An epic run-fest goes the way of @SunRisers 🧡
The Pat Cummins-led side registers a 4️⃣4️⃣-run win over Rajasthan Royals 👏
Scorecard ▶ https://t.co/ltVZAvInEG#TATAIPL | #SRHvRR pic.twitter.com/kjCtGW8NdV— IndianPremierLeague (@IPL) March 23, 2025
లక్నోతో మ్యాచ్ విషయానికొస్తే..
కాగా గురువారం ఉప్పల్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ(6)తో పాటు గత మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదిన ఇషాన్ కిషన్ (0) ఈసారి పూర్తిగా విఫలమయ్యాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47) తనదైన షాట్లతో కాసేపు అలరించగా.. నితీశ్ రెడ్డి(28 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించాడు.
అయితే, జోరు మీదున్న హెన్రిక్ క్లాసెన్ (17 బంతుల్లో 26) రనౌట్ కాగా.. తుపాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన అనికేత్ వర్మ (13 బంతుల్లో 36)కు దిగ్వేశ్ రాఠీ చెక్ పెట్టాడు.
శార్దూల్ ఠాకూర్ ఫోర్
ఆఖర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఆవేశ్ ఖాన్ అతడికి కళ్లెం వేశాడు. ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో రైజర్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులే చేయగలిగింది.
లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు.. లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు రైజర్స్ పేసర్ మహ్మద్ షమీ.. ఐడెన్ మార్క్రమ్(1)ను ఆదిలోనే అవుట్ చేసి షాకిచ్చాడు.
పూరన్‌ను పూనకాలు
అయితే, మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52), నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70) ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో రైజర్స్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి అర్ధ శతకాలతో దుమ్ములేపారు. ఈ క్రమంలో 16.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేసిన లక్నో.. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
చదవండి: IPL 2025: నికోలస్ పూరన్ ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైరల్