
మాడ్రిడ్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నమెంట్ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ 147–144తో హజల్ బురున్ (తుర్కియే)పై, పర్ణీత్ కౌర్ 142–141తో క్యూర్ గిరిడి (తుర్కియే)పై విజయం సాధించారు. మరోవైపు రికర్వ్ విభాగంలో భారత జట్లకు నిరాశ ఎదురైంది. భారత పురుషుల, మహిళల జట్లు కనీసం మూడో రౌండ్‌కు కూడా చేరుకోలేకపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, రాహుల్, నీరజ్ చౌహాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు రెండో రౌండ్‌లో 2–6 (55–56, 54–57, 57–56, 54–56) సెట్ పాయింట్ల స్కోరుతో జ్విక్ ఎలీ, మార్కస్ అల్మీదా, మథియాస్ గోమ్స్‌లతో కూడిన బ్రెజిల్ జట్టు చేతిలో ఓడిపోయింది.
దీపిక కుమారి, అంకిత, గాథ ఖడకేలతో కూడిన భారత మహిళల జట్టు కూడా రెండో రౌండ్‌లోనే వెనుదిరిగింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్‌లో 3–5 (58–54, 55–55, 54–55, 53–54) సెట్ పాయింట్ల స్కోరుతో అమెలీ కార్డెయు, లీసా బార్బెలిన్, విక్టోరియా సెబాస్టియన్‌లతో కూడిన ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓటమి పాలైంది.