
టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కీలక బ్యాటర్ జితేశ్ శర్మ (Jitesh Sharma)కు చేదు అనుభవం ఎదురైంది. భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య మూడో టెస్టు వీక్షించేందుకు వెళ్తుంటే భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. తాను ఎవరన్న విషయం స్పష్టంగా చెప్పినా.. లార్డ్స్ మైదానం (Lord's Stadium)లోకి ప్రవేశించకుండా ఆపేశారు.
డీకేను సాయం కోరిన జితేశ్
ఇలా జితేశ్ శర్మ స్టేడియం వెలుపల భద్రతా సిబ్బందితో పాట్లు పడుతున్న వేళ.. ఆర్సీబీ కోచ్, టీమిండియా- ఇంగ్లండ్ సిరీస్ కామెంటేటర్ దినేశ్ కార్తిక్ బయటకు వచ్చాడు. అయితే, అతడు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. ఇంతలో డీకేను చూసిన జితేశ్.. తనకు సాయం చేయాల్సిందిగా అతడిని కోరాడు.
కానీ.. అప్పటికే ఆటోగ్రాఫ్‌లు, ఫొటోల కోసం తనను చుట్టుముట్టిన అభిమానుల గోల కారణంగా జితేశ్.. దినేశ్ కార్తిక్‌ను పిలిచినా అతడికి.. జితేశ్ గొంతు వినబడే పరిస్థితి లేకపోయింది. దీంతో జితేశ్ స్వయంగా డీకేకు ఫోన్ చేసి తన ఇబ్బంది గురించి చెప్పగా.. అతడు రంగంలోకి దిగాడు. అనంతరం ఇద్దరూ కలిసి మైదానంలోకి వెళ్లారు.
ఇంతలా అవమానిస్తారా?.. అదేం లేదు!
ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. ‘‘అంతర్జాతీయ క్రికెటర్ అయిన జితేశ్ శర్మను ఇంతలా అవమానిస్తారా?’’ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ మండిపడుతుండగా.. సెక్యూరిటీ సిబ్బంది తమ విధి నిర్వహణలో భాగంగానే ఇలా చేసిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
అదే విధంగా.. లార్డ్స్ ఎంట్రీ విషయంలో కచ్చితమైన నిబంధనలు ఉంటాయని.. స్టువర్ట్ బ్రాడ్ సైతం రిటైర్ అయిన వెంటనే తనకు స్టేడియంలోకి నేరుగా వచ్చే యాక్సెస్ లేకుండా పోయిందని గుర్తుచేస్తున్నారు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా సిబ్బంది అలా ప్రవర్తించడంలో తప్పులేదని సమర్థిస్తున్నారు.
ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర
కాగా 2023లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు విదర్భ ఆటగాడు జితేశ్ శర్మ. ఇప్పటికి ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడి. 100 పరుగులు సాధించాడు. ఈ 31 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటి వరకు వన్డే, టెస్టుల్లో మాత్రం అరంగేట్రం చేయలేదు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో జితేశ్ శర్మది కీలక పాత్ర. 15 మ్యాచ్‌లలో కలిపి 261 పరుగులు చేసిన జితేశ్.. రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ గైర్హాజరీలో జట్టును ముందుండి నడిపించాడు కూడా!.. ఇక ఐపీఎల్-2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.
ఇక ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోన్న భారత జట్టు.. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సిరీస్‌లో 1-2తో వెనుకబడింది గిల్ సేన. కాగా అంతకుముందు ముందు లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్‌లో నాలుగో టెస్టు జరుగుతుంది.
చదవండి: వాళ్లిద్దరిలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరు?.. కుండబద్దలు కొట్టేసిన లారా
— Out Of Context Cricket (@GemsOfCricket) July 16, 2025