Formula-E Race Winner: హైదరాబాద్‌లో ముగిసిన ఫార్ములా-ఈ రేసింగ్‌.. విజేత ఎవరంటే?

Jean-Eric Vergne Wins India First-Ever Formula-E Race Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నెక్లెస్‌ రోడ్‌ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌ ముగిసింది. భారత్‌లో తొలిసారి హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న రేసింగ్‌లో ప్రపంచస్థాయి రేసర్లు అదరగొట్టారు. శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ప్రారంభమైన రేసు గంటన్నర పాటు కొనసాగింది.  ఫార్ములా-ఈ రేస్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా జీన్‌ ఎరిక్‌ వెర్గ్‌నే(డీఎస్‌ పెన్‌స్కే రేసింగ్‌) నిలిచాడు.

ఆ తర్వాత రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ(ఎన్‌విజన్‌ రేసింగ్‌), మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమి(ఎన్‌విజన్‌ రేసింగ్‌) ఉన్నారు.  గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. కాగా  జీన్‌ ఎరిక్‌ ఇప్పటికే రెండుసార్లు ఫార్ములా-ఈ ఛాంపియన్‌ కావడం విశేషం. తాజా విజయంతో అతను మూడోసారి ఛాంపియన్‌గా అవతరించాడు.

2013లో ఫార్ములా-1 రేసు తర్వాత భారత్‌లో జరుగుతున్న ఫార్ములా-ఈ తొలి రేసుకు మన హైదరాబాద్‌ వేదికైంది. దీనికి తోడు ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఫార్ములా-ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా హైదరాబాద్‌ చోటు దక్కించుకుంది. హుసేన్‌సాగర్‌ తీరప్రాంతంలో 2.8కిలోమీటర్ల నిడివితో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్‌పై మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు తమ కార్లను పరుగులు పెట్టించారు. తొలిసారి ప్రవేశపెట్టిన అత్యాధునిక జెన్‌3 కార్లతో రేసర్లు దుమ్ములేపారు. రేసింగ్‌లో విదేశీ కంపెనీలు, రేసర్లదే హవా కాగా, భారత్‌ నుంచి మహీంద్ర రేసింగ్‌, టీసీఎస్‌ జాగ్వార్‌ బరిలోకి దిగడం గర్వంగా అనిపించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top