
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా తేలిపోయాడు. తన శైలికి విరుద్దంగా బౌలింగ్ చేసి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అస్సలు మనం చూస్తుందని బుమ్రా బౌలింగేనా అన్నట్లు అన్పించింది.
డౌన్‌ది లెగ్ ఎక్కువగా వేయడం, బౌలింగ్‌లో వేగం లేకపోవడం, సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయకపోవడం వంటి తప్పిదాలను బుమ్రా చేశాడు. సాధారణంగా 138-142 కి.మీ వేగంతో బంతులు వేసే బుమ్రా.. ఈ మ్యాచ్‌లో అందుకు భిన్నంగా ఒకే ఒక్కసారి 140 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేశాడు.
మాంచెస్టర్‌లో బుమ్రా 33 ఓవర్లు బౌలింగ్ చేసి 112 పరుగులు ఇచ్చి కేవలం రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తన ఏడేళ్ల టెస్ట్ కెరీర్‌లో ఓ ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగులు సమర్పించుకోవడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో బుమ్రాపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
గతంలో మాదిరిగా ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసే సామర్థ్యాన్ని బుమ్రా ప్రస్తుతం కోల్పోయడని కైఫ్ అన్నాడు. అంతేకాకుండా రోహిత్, విరాట్ కోహ్లిల టెస్టులకు బుమ్రా వీడ్కోలు పలికినా ఆశ్చర్యపోన్కర్లేదని అతడు జోస్యం చెప్పాడు.
"ఇకపై టెస్టుల్లో బుమ్రాను మనం చూడలేకపోవచ్చు. అతడు త్వరలోనే రెడ్‌బాల్ క్రికెట్(టెస్టులు)కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నేను అనుకుంటున్నాను. అతడు ఇప్పటికి వేగంతో బౌలింగ్ చేయగలడు. కానీ అందుకు అతడి శరీరం సహకరించడం లేదు.
ఒక ఆటగాడు జట్టు కోసం 100 శాతం ఎఫక్ట్ పెట్టలేనని, వికెట్లు తీయలేనని భావించిన రోజున అతడే స్వయంగా తప్పుకొంటాడు. దేశం కోసం ఆడాలన్న తపన, అంకితభావం బుమ్రాలో ఇప్పటికి ఉంది. కానీ అతడు తన ఫిట్‌నెస్‌ను కోల్పోయాడు. అతడు బలవంతంగా ఆడితే భవిష్యత్తులో కచ్చితంగా అతడు ఇబ్బందులు ఎదుర్కొంటాడు.
ఇదివరకే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అశ్విన్ వంటి లెజెండరీ ప్లేయర్లు టెస్టులకు వీడ్కోలు పలికారు. ఆ జాబితాలో ఇప్పుడు బుమ్రా చేరనున్నాడు. కాబట్టి బుమ్రా లేని భారత జట్టును చూడడం అభిమానులు అలవాటు చేసుకోవాలని" తన యూట్యూబ్ ఛానల్‌లో కైఫ్ పేర్కొన్నాడు.