
భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ గురువారం(ఆక్టోబర్ 2) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్టుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది.
కెప్టెన్ శుబ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి వారు నేరుగా దుబాయ్ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. వీరంతా సెప్టెంబర్ 28న జరిగిన ఆసియాకప్-2025లో ఫైనల్లో భారత జట్టు తరపున ఆడారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఐదు రోజుల టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యారు.
అయితే వర్క్‌లోడ్‌లో భాగంగా తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడుతాడా లేదా అన్నది? ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ఆసియాకప్‌లో కూడా బుమ్రా కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌లకు మాత్రమే జస్ప్రీత్ అందుబాటులో ఉన్నాడు.
మరి ఇప్పుడు విండీస్‌తో అన్ని మ్యాచ్‌లు బుమ్రా ఆడుతాడో లేదో వేచి చూడాలి. తాజాగా ఇదే విషయంపై ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు కాంబనేషన్‌పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని గిల్ చెప్పుకొచ్చాడు.
"జట్టు కాంబనేషన్‌పై మ్యాచ్ టు మ్యాచ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాము. గేమ్ ఎంత సేపు సాగుతుంది, ఒక బౌలర్ ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలడు? ఇటువంటి ఆంశాలను పరిగణలోకి తీసుకుని తుది జట్టును ఎంపిక చేస్తాము. అంతే తప్ప ముందుగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోము.
తొలి మ్యాచ్‌లో మా జట్టు కాంబనేషన్ గురుంచి రేపు మీకు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు, పిచ్ కండీషన్ బట్టి మూడవ సీమర్‌ను ఆడించాలా వద్దా అన్నది రేపు నిర్ణయం తీసుకుంటాము" అని గిల్ పేర్కొన్నాడు.
అయితే బుమ్రా రెండు మ్యాచ్‌లు కూడా అడే అవకాశముంది. ఇదే విషయాన్ని జట్టు ప్రకటన సందర్భంగా బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. బుమ్రా వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టులు ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని అగార్కర్ తెలిపాడు. అదేవిధంగా బుమ్రాకు దాదాపు ఐదు వారాల విశ్రాంతి లభించందని అతడు వెల్లడించాడు.
చదవండి: వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు ఊహించని షాక్