
దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2024 వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్ల భారీ మొత్తం వెచ్చించి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. అయితే కమ్మిన్స్ అంత భారీ ధరకు అమ్ముడుపోవడం పట్ల ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కమ్మిన్స్‌కు టీ20ల్లో కంటే టెస్టుల్లోనే మంచి రికార్డు ఉందని గిల్లెప్సీ అభిప్రాయపడ్డాడు.
'పాట్ కమ్మిన్స్ వరల్డ్‌క్లాస్ క్వాలిటీ బౌలర్. అందులో ఎటువంటి సందేహం లేదు. అదే విధంగా మంచి కెప్టెన్ కూడా. కానీ టీ20లకు అతడి సరిపోడు. టీ20లో మంచి రికార్డుల కూడా లేవు. నావరకు అయితే కమ్మిన్స్ టెస్టు ఫార్మాట్ బౌలర్. టెస్టు క్రికెట్ అయితే అతడికి వెన్నతో పెట్టిన విద్య" అని సేన్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్లెప్సీ పేర్కొన్నాడు.
కాగా కమ్మిన్స్ ఐపీఎల్‌లో ప్యాట్ కమిన్స్ ఢిల్లీ తరఫున 12 మ్యాచ్‌లు, కోల్‌కతా తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 42 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు పడగొట్టాడు. 2020 వేలంలో కేకేఆర్ అతనికి రూ. 15.50 కోట్లు ఇచ్చింది. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా 2023 సీజన్‌లో కమిన్స్ ఆడలేదు. వరల్డ్ కప్‌లో జట్టును విజేతగా నిలిపి అతను మళ్లీ ఐపీఎల్‌లో అడుగు పెట్టాడు.
చదవండి: Sanju Samson: గర్వంగా ఉంది.. చాలా కష్టపడ్డాను! అతడొక అద్భుతం