న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌ను రద్దు చేసుకొని, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.
జనవరి 21 నుంచి 31 వరకు భారత్‌లో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టులో ఎంపికైన నీషమ్, చివరి నిమిషంలో జాతీయ విధులను వద్దనుకొని, ఫ్రాంచైజీ లీగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ విషయాన్ని రాజ్‌షాహీ వారియర్స్ (నీషమ్ బీపీఎల్ ఫ్రాంచైజీ) హెడ్ కోచ్ హన్నన్ సర్కార్ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు.
కాగా, భారత్‌తో సిరీస్ న్యూజిలాండ్ జట్టుకు ప్రపంచకప్‌కు ముందు రిహార్సల్‌గా భావించబడుతోంది. ఈ సిరీస్‌కు ఎంపికైన వారే దాదాపుగా ప్రపంచకప్ జట్టులోనూ ఉంటారు. నీషమ్ కూడా న్యూజిలాండ్ ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి దేశ ప్రయోజనాలు కాకుండా, వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై న్యూజిలాండ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
నీషమ్‌ను ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనా నీషమ్ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ జట్టులో లేకపోవడం న్యూజిలాండ్‌కు పెద్ద లోటుగా పరిగణించబడుతుంది. అది భారత్‌తో సిరీస్ అయినా, ప్రపంచకప్ అయినా నీషబ్ లేని లోటు న్యూజిలాండ్ జట్టులో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
కాగా, ప్రస్తుతం జరుగుతున్న బీపీఎల్ 2025-26 ఎడిషన్‌లో నీషమ్ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శనలేమీ చేయలేదు. నాలుగు మ్యాచ్‌ల్లో 30 పరుగులు, మూడు వికెట్లు మాత్రమే తీశాడు. నీషమ్ సత్తా చాటలేకపోయినప్పటికీ అతని జట్టు రాజ్‌షాహీ వారియర్స్ లీగ్ దశలో అగ్రస్థానంలో (10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు) నిలిచింది. రాజ్‌షాహీ వారియర్స్ జనవరి 20న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో చట్టోగ్రామ్ రాయల్స్‌తో (తొలి క్వాలిఫయర్) తలపడనుంది.
ఇదిలా ఉంటే, జనవరి 21న నాగ్‌పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జరుగనుంది. 35 ఏళ్ల నీషమ్‌కు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం తప్పక ఉండేది.
భారత్‌తో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు..
హెన్రీ నికోల్స్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), నిక్ కెల్లీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జకరీ ఫౌల్క్స్, జోష్ క్లార్క్‌సన్, డెవాన్ కాన్వే, మిచెల్ హే, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్, జేడన్ లెన్నాక్స్, మైఖేల్ రే


