
టీమిండియా వన్డే కెప్టెన్ మార్పు విషయంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించాడంటూ హిట్‌మ్యాన్ అభిమానులు గౌతీని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. గౌతీతో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్‌పై కూడా రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
అది సిగ్గుచేటు
ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ రోహిత్ శర్మను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో మరోసారి తెరమీదకు వచ్చింది. ఇందులో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ కాకపోతే అది జట్టు చేసుకున్న దురదృష్టమే కానీ... రోహిత్‌కు కాదు.
పరిమిత ఓవర్ల క్రికెట్ లేదంటే టీ20 జట్టుకు అతడు కెప్టెన్ కాలేదంటే.. అది సిగ్గుచేటు. ఇంతకంటే రోహిత్ శర్మ ఇంకేం చేస్తే కెప్టెన్సీకి అర్హుడు అవుతాడు?’’ అంటూ గంభీర్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శిస్తూ రోహిత్ శర్మకు మద్దతు తెలిపాడు. పరోక్షంగా విరాట్ కోహ్లిని టార్గెట్ చేశాడు.
నాడు కోహ్లి స్థానంలో రోహిత్ శర్మ
కాగా టీ20 ప్రపంచకప్-2021లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే టీమిండియా ఇంటిబాట పట్టడంతో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ కోహ్లిని తప్పించగా.. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి స్వయంగా తప్పుకొన్నాడు.
ఈ క్రమంలో 2021-22 మధ్య కాలంలో కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌ను చేసింది బీసీసీఐ. అప్పటి నుంచి రోహిత్ సారథ్యంలో టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లలో సత్తా చాటిన టీమిండియా గతేడాది వరల్డ్‌కప్ గెలిచింది.
అంతకుముందు వన్డే వరల్డ్‌కప్-2023లో అజేయంగా ఫైనల్ చేరింది. ఇటీవల ఐసీసీ చాంపియన్స్‌ట్రోఫీ-2025 గెలిచింది. అయితే, ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేల్లో కొనసాగుతానని చెప్పగా.. బీసీసీఐ అనూహ్యంగా అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది.
ఇపుడు రోహిత్ ప్లేస్‌లో గిల్
రోహిత్ స్థానంలో టెస్టు సారథిగా వచ్చిన యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌కు వన్డే పగ్గాలనూ అప్పగించింది. ఇందులో హెడ్‌కోచ్ గంభీర్ పాత్ర కీలకం అని తెలుస్తోంది. గంభీర్‌తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలిసి 38 ఏళ్ల రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించాలనే నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొనడం గమనార్హం.
ఈ నేపథ్యంలో గంభీర్ గతంలో రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘‘అప్పుడలా.. ఇప్పుడిలా.. నిజంగానే ఇది సిగ్గుచేటు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2027 నాటికి గిల్ చుట్టు జట్టును నిర్మించే క్రమంలో అతడిని కెప్టెన్‌ను చేసినట్లు అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.
చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్
Never seen anyone more hypocritical and two-faced than Gautam Gambhir. The same guy who once said, “If Rohit Sharma doesn’t become India’s captain, it’s India’s loss, not Rohit’s,” now doesn’t want him as captain after becoming coach himself. pic.twitter.com/pqRzYKDR2a
— Kusha Sharma (@Kushacritic) October 4, 2025