ISSF World Championship: 18 ఏళ్లకే ప్రపంచ చాంపియన్‌

ISSF World Championship: Indian teenager Rudrankksh Patil wins Gold Medal - Sakshi

10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో విశ్వవిజేతగా రుద్రాంక్ష్ పాటిల్‌

అభినవ్‌ బింద్రా తర్వాత ఈ ఘనత సాధించిన భారత షూటర్‌గా గుర్తింపు

2024 పారిస్‌ ఒలింపిక్స్‌కూ అర్హత  

కైరో: విశ్వ వేదికగా మరోసారి భారత షూటర్‌ గురి అదిరింది. ప్రపంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌ షిప్‌లో భారత్‌ ‘పసిడి’ ఖాతా తెరిచింది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో మహారాష్ట్రకు చెందిన 18 ఏళ్ల రుద్రాంక్ష్  బాలాసాహెబ్‌ పాటిల్‌ స్వర్ణ పతకంతో మెరిశాడు. ఈ ప్రదర్శనతో రుద్రాంక్ష్  2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు.

థానేకు చెందిన రుద్రాంక్ష్ ఫైనల్లో 17–13 పాయింట్ల తేడాతో డానిలో డెనిస్‌ సొలాజో (ఇటలీ)పై గెలుపొందాడు. తొలిసారి ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న రుద్రాంక్ష్  ఫైనల్లో ఒకదశలో 4–10తో వెనుకంజలో ఉన్నాడు. అయినా ఒత్తిడికి లోనుకాకుండా లక్ష్యంపై గురి పెట్టిన ఈ టీనేజ్‌ షూటర్‌ చివరకు నాలుగు పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు 114 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో రుద్రాంక్ష్  633.9 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు.

భారత్‌కే చెందిన అంకుశ్‌ కిరణ్‌ జాదవ్‌ 630.6 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచాడు. టాప్‌–8లో నిలిచిన షూటర్లు ర్యాంకింగ్‌ మ్యాచ్‌కు అర్హత సాధించారు. ర్యాంకింగ్‌ మ్యాచ్‌లో సొలాజో 262.7 పాయింట్లతో, రుద్రాంక్ష్  261.9 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన స్వర్ణ పతక పోరుకు అర్హత పొందారు. అంకుశ్‌ 154.2 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ర్యాంకింగ్‌ మ్యాచ్‌లో 261.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన చైనా షూటర్‌ లిహావో షెంగ్‌ కాంస్య పతకం దక్కించుకున్నాడు. అభినవ్‌ బింద్రా తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రెండో భారతీయ షూటర్‌గా రుద్రాంక్ష్  గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో భారత్‌ తరఫున పసిడి పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా రుద్రాంక్ష్  రికార్డు నెలకొల్పాడు.

గత ఏడాది పెరూలో జరిగిన జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రుద్రాంక్ష్  రజతం నెగ్గగా.. ఈ ఏడాది జర్మనీలో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించాడు. ఈ సంవత్సరమే సీనియర్‌ జట్టులోకి వచ్చిన రుద్రాంక్ష్  రెండు ప్రపంచకప్‌లలో పాల్గొన్నా పతకం సాధించలేకపోయాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెరిసి స్వర్ణంతోపాటు ఒలింపిక్స్‌కు అర్హత పొంది ఔరా అనిపించాడు.  

ప్రపంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆరో భారతీయ షూటర్‌ రుద్రాంక్ష్ . గతంలో   అభినవ్‌ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌), మానవ్‌జిత్‌ సంధూ (2006; ట్రాప్‌), తేజస్విని సావంత్‌ (2010; 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌), అంకుర్‌ మిట్టల్‌ (2018; డబుల్‌ ట్రాప్‌), ఓంప్రకాశ్‌ (2018; 50 మీటర్ల పిస్టల్‌) ఈ ఘనత సాధించారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top