డ్రాతో ప్ర‌యాణం మొద‌లు.. తుపాకీ పేల్చిన ఇరాన్ ఆట‌గాడు! | Iran Begin FIFA World Cup 2026 Match Drawn Vs New Zealand | Sakshi
Sakshi News home page

డ్రాతో ప్ర‌యాణం మొద‌లు.. తుపాకీ పేల్చిన ఇరాన్ ఆట‌గాడు!

Jun 16 2026 10:41 AM | Updated on Jun 16 2026 11:23 AM

Iran Begin FIFA World Cup 2026 Match Drawn Vs New Zealand

ఫిఫా ప్రపంచకప్ ప్ర‌యాణాన్ని ఇరాన్ డ్రాతో ఆరంభించింది. గ్రూప్‌-జిలో భాగంగా లాస్ ఏంజిల్స్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఇరాన్ 2-2తో డ్రా చేసుకుంది. ఇరాన్ తరఫున ఆట 32వ నిమిషంలో రమిన్ రిజెయిన్, ఆట 64వ నిమిషంలో మొహమ్మద్ మొహెబి గోల్ కొట్టగా, న్యూజిలాండ్ తరఫున ఎలిజా జస్ట్‌ (ఆట 7, 55వనిమిషంలో) డబుల్ గోల్స్‌తో మెరిశాడు. మ్యాచ్ డ్రా కావ‌డంతో ఇరుజ‌ట్లు చెరో పాయింట్ గెలుచుకున్నాయి. 

అంత‌క‌ముందు ఇదే గ్రూప్‌లో బెల్జియం, ఈజిప్ట్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ కూడా డ్రాగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్నో ఉత్కంఠ ప‌రిణామాల న‌డుమ ఫిఫా ఆడేందుకు అమెరికాలో అడుగుపెట్టిన ఇరాన్ త‌న స్థాయికి త‌గ్గ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింద‌ని చెప్పొచ్చు. అయితే మ్యాచ్ డ్రా సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఇరాన్ ప్లేయ‌ర్ మొహ‌మ్మ‌ద్ మొహెబి చ‌ర్య వివాదాస్ప‌దంగా మారింది. 

న్యూజిలాండ్ రెండో గోల్ కొట్టి జోష్‌లో ఉంది. ఈ స‌మ‌యంలో న్యూజిలాండ్ డిఫెన్స్ టీమ్‌ను దాటుకొని ఆట 64వ నిమిషంలో మొహ‌మ్మ‌ద్ మొహెబి కార్న‌ర్ నుంచి బంతిని నేరుగా గోల్ పోస్టులోకి తర‌లించాడు. ఈ సంతోషంలో అత‌డు త‌న చేతిని తుపాకీగా మార్చుకొని గాల్లోకి కాల్పులు జ‌రుపుతున్న‌ట్లుగా ఫోజు ఇస్తూ సెల‌బ్రేష‌న్ చేసుకున్నాడు. అత‌డి చ‌ర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

అయితే మొహ‌మ్మ‌ద్ మొహెబి సెల‌బ్రేష‌న్‌పై కొంత‌మంది ఫుట్‌బాల్ అభిమానులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అయితే స్టేడియంలో అమెరికాకు చెందిన వాళ్లు కూడా ఉండ‌డంతో వాళ్లు వైపు చూస్తూ మొహ‌మ్మ‌ద్ ఇలాంటి సంజ్ఞ‌లు చేశాడని.. ఒక‌వైపు ఆట‌కు రాజ‌కీయాలతో సంబంధం లేద‌ని ఇరాన్ ఫుట్‌బాల్ జ‌ట్టు పేర్కొంటే.. మ‌రోవైపు ఆ జ‌ట్టుకు చెందిన ఆట‌గాడు ఇలాంటి సెల‌బ్రేష‌న్‌ను చేసుకోవ‌డం వివాదానికి దారి తీసింది.మొహ‌మ్మ‌ద్‌ను ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడ‌కుండా బ్యాన్ చేయాల‌ని కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఆట ప్రారంభానికి ముందు హైడ్రామా
అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు హైడ్రామా నెల‌కొంది. ఫిఫా, స్థానిక అధికారులు అనేక ఆంక్షలు విధించినప్పటికీ, ఆట మొత్తం రాజకీయ ఉద్రిక్తంగానే కొనసాగింది. ఇరాన్ మద్దతుదారులు స్టేడియం లోపల విప్లవానికి పూర్వం నాటి ఇరాన్ జెండాను ప్రదర్శించి ఫిఫా నిబంధ‌న‌లు ఉల్లంఘించారు. మ్యాచ్‌కు త‌ర‌లివ‌చ్చిన ఇరాన్, న్యూజిలాండ్‌ అభిమానులు మెటల్ డిటెక్టర్లు, బ్యాగ్ తనిఖీల త‌ర్వాత‌నే స్టేడియంలోకి అనుమ‌తించారు.

అమెరికా వదిలి వెళ్లిపోండి
ఇక మ్యాచ్‌ ముగిసిన వెంటనే అమెరికా అధికారులు ఇరాన్‌ జట్టును తమ దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇరాన్‌ కోచ్‌ ఆమీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌ తమ బేస్‌ క్యాంప్‌ను మెక్సికోకు తరలించిన సంగతి తెలిసిందే.

చదవండి: స్పెయిన్‌కు చుక్కలు చూపించిన గోల్‌కీపర్‌.. ఎవరీ వోజిన్హా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement