
Photo Courtesy: BCCI
ఐపీఎల్‌లో సీఎస్‌కే స్టాండ్ ఇన్ కెప్టెన్ ఎంఎస్ ధోని మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఓ జట్టుపై 50 సిక్సర్లు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి కూడా ఇప్పటివరకు ఈ రికార్డు సాధ్యం కాలేదు. ధోనికి ముందు క్రిస్ గేల్, రోహిత్ శర్మ మాత్రమే ఈ ఘనత సాధించారు.
గేల్ పంజాబ్ (61), కేకేఆర్‌పై (54) 50 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టాడు. గేల్ తర్వాత రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. హిట్‌మ్యాన్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 50 సిక్సర్లు కొట్టాడు.
నిన్న (మే 3) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ధోని 50 సిక్సర్ల ఘనత సాధించాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి ఈ అరుదైన మైలురాయిని తాకాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో ధోని (262) నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ (357), రోహిత్ శర్మ (297), విరాట్ కోహ్లి (290) ధోని కంటే ముందున్నారు.
ఐపీఎల్‌లో ఓ జట్టుపై 50కి పైగా సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు
61 - క్రిస్ గేల్ vs PBKS
54 - క్రిస్ గేల్ vs KKR
50 - రోహిత్ శర్మ vs DC
50 - MS ధోని vs RCB*
మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన సమరంలో సీఎస్‌కేపై ఆర్సీబీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్‌కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. జేకబ్ బేతెల్ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్ (14 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
సీఎస్‌కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్ అహ్మద్ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. ఖలీల్ అహ్మద్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0). ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్‌లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్ ఆ ఓవర్‌లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.
అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. చివరి బంతి వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులకే పరిమితమైంది. ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సీఎస్‌కేను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.
సీఎస్‌కే గెలుపుకు చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా సీఎస్‌కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. దయాల్, కృనాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.