క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహుల్‌ సరసన ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ | IPL 2025: Prabhsimran Singh 3rd Consecutive 50 joins Gayle KL Rahul in Elite List | Sakshi
Sakshi News home page

క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహుల్‌ సరసన ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌

Published Sun, May 4 2025 9:48 PM | Last Updated on Sun, May 4 2025 9:48 PM

IPL 2025: Prabhsimran Singh 3rd Consecutive 50 joins Gayle KL Rahul in Elite List

లక్నో సూపర్‌ జెయింట్స్‌ (PBKS vs LSG)తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (Prabhsimran Singh) పరుగుల వరద పారించాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చితక్కొడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే, దురదృష్టవశాత్తూ శతకానికి తొమ్మిది పరుగుల దూరంలో ప్రభ్‌సిమ్రన్‌ ఆగిపోయాడు.

అయితేనేం.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తన అద్బుత ఆట తీరుతో క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహల్‌ (KL Rahul)సరసన నిలిచాడు. గతేడాది నిలకడైన ప్రదర్శన కనబరిచిన ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ను పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు భారీ ధరకు అట్టిపెట్టుకుంది. అతడి కోసం పర్సు నుంచి నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించింది.

అందుకు తగ్గట్లుగానే ప్రభ్‌సిమ్రన్‌ ఈసారీ పైసా వసూల్‌ ప్రదర్శన ఇస్తున్నాడు. మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా లక్నోతో మ్యాచ్‌లోనూ అతడు బ్యాట్‌ ఝులిపించాడు. మొత్తంగా 48 బంతుల్లో ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 91 పరుగులు సాధించాడు.

అయితే, దిగ్వేశ్‌ రాఠీ బౌలింగ్‌లో నికోలస్‌ పూరన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ప్రభ్‌సిమ్రన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక అతడికి ఈ సీజన్‌లో ఇది ఓపెనర్‌గా వరుసగా మూడో అర్ధ శతకం కావడం విశేషం. తద్వారా పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఒకే సీజన్‌లో ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ప్రభ్‌సిమ్రన్‌ చేరిపోయాడు.

ఇక ఐపీఎల్‌-2025లో పంజాబ్‌ కింగ్స్‌ ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు గెలిచింది. ఒకటి వర్షం కారణంగా రద్దైంది. ఈ క్రమంలో 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా లక్నోతో మ్యాచ్‌లోనూ గెలిస్తే ప్లే ఆఫ్స్‌ రేసులో మరింత ముందుకు దూసుకుపోతుంది.

మరోవైపు.. ఈ సీజన్‌లో ఇప్పటికి (ఈ మ్యాచ్‌తో కలిపి) పదకొండు ఇన్నింగ్స్‌ ఆడిన ప్రభ్‌సిమ్రన్‌ 437 పరుగులు సాధించాడు. తద్వారా పంజాబ్‌ కింగ్స్‌ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికి నాలుగు అర్థ శతకాలు ఉన్నాయి. ఇక లక్నోతో ఆదివారం నాటి మ్యాచ్‌లో పంజాబ్‌ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి 236 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌తో పాటు జోష్‌ ఇంగ్లిస్‌ (14 బంతుల్లో 30), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (25 బంతుల్లో 45), శశాంక్‌ సింగ్‌ (15 బంతుల్లో 33 నాటౌట్‌), మార్కస్‌ స్టొయినిస్‌ (5 బంతుల్లో 15) దంచికొట్టారు.

ఒక సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఓపెనర్‌గా వరుసగా అత్యధిక అర్ధ శతకాలు సాధించింది వీరే
క్రిస్‌ గేల్‌ (2018)- మూడు
కేఎల్‌ రాహుల్‌ (2018)- మూడు
కేఎల్‌ రాహుల్‌ (2019)- మూడు
కేఎల్‌ రాహుల్‌ (2020)- మూడు
ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (2025*) మూడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement