IPL 2025, Qualifier 1: అరుదైన రికార్డు సాధించిన పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌ | Qualifier 1, PBKS VS RCB: Prabhsimran Completes 500 Runs In IPL 2025, Joins Elite List Featuring Suryakumar Yadav | Sakshi
Sakshi News home page

IPL 2025, Qualifier 1: అరుదైన రికార్డు సాధించిన పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌

May 29 2025 8:49 PM | Updated on May 29 2025 9:05 PM

Qualifier 1, PBKS VS RCB: Prabhsimran Completes 500 Runs In IPL 2025, Joins Elite List Featuring Suryakumar Yadav

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 18 పరుగులకే ఔటైన ప్రభ్‌సిమ్రన్‌.. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఓ ఐపీఎల్‌ సీజన్‌లో 500 పరుగులు పూర్తి చేసిన ఆరో అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

ఐపీఎల్‌ తొలి సీజన్‌లో పంజాబ్‌కే చెందిన షాన్‌ మార్ష్‌ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు కాగా.. 2018లో సూర్యకుమార్‌ యాదవ్‌ (ఎంఐ), 2020 సీజన్‌లో ఇషాన్‌ కిషన్‌ (ఎంఐ), 2023 సీజన్‌లో యశస్వి జైస్వాల్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌), 2024 సీజన్‌లో రియాన్‌ పరాగ్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌) ఈ ఘనత సాధించిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లుగా రికార్డుల్లో ఉన్నారు. 

ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన ప్రభ్‌సిమ్రన్‌ 517 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా 500 పరుగుల మార్కును దాటాడు (15 మ్యాచ్‌ల్లో 516 పరుగులు).

ఇదిలా ఉంటే, ఆర్సీబీతో జరుగుతున్న క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ దాదాపుగా చేతులెత్తేసింది. ఈ జట్టు 13 ఓవర్లలో కేవలం 92 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేశారు. 

సుయాశ్‌ శర్మ 3, జోష్‌ హాజిల్‌వుడ్‌, యశ్‌ దయాల్‌ తలో 2, భువనేశ్వర్‌ కుమార్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. పంజాబ్‌ బ్యాటర్లలో ప్రియాంశ్‌ ఆర్య 7, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 18, జోస్‌ ఇంగ్లిస్‌ 4, శ్రేయస్‌ అయ్యర్‌ 2, నేహల్‌ వధేరా 8, మార్కస్‌ స్టోయినిస్‌ 26, శశాంక్‌ సింగ్‌ 3, ముషీర్‌ ఖాన్‌ 0 పరుగులకు ఔట్‌ కాగా.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 13, హర్ప్రీత్‌ బ్రార్‌ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడినా మరో అవకాశం (క్వాలిఫయర్‌-2) ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement