
Photo Courtesy: BCCI
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న (మే 8) ధర్మశాల వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమైన మ్యాచ్‌ను బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. బ్లాక్ అవుట్ ప్రకటనకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ పరుగుల వరద పారించింది. ఆ జట్టు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (34 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) భారీ షాట్లతో విధ్వంసం సృష్టించారు.
వీరిద్దరి ధాటికి పంజాబ్ పవర్ ప్లేలో 69 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన ప్రియాంశ్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రభ్‌సిమ్రన్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి సీజన్‌లో వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించాడు. ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్ పోటీపడి చెలరేగడంతో పంజాబ్ 10 ఓవర్లలో ఏకంగా 122 పరుగులు చేసింది.
అనంతరం 11వ ఓవర్ తొలి బంతికే సీజన్ తొలి మ్యాచ్ ఆడుతున్న నటరాజన్ ప్రియాంశ్ ఆర్యను ఔట్ చేశాడు.అప్పుడే అధికారుల నుంచి బ్లాక్ అవుట్ సమాచారం రావడంతో స్టేడియం నిర్వహకులు ఓ ఫ్లడ్ లైట్‌ను బంద్ చేశారు. కొద్ది సేపటికి మరో రెండు ఫ్లడ్ లైట్లు కూడా బందయ్యాయి. దీని తర్వాత మరి కొద్ది సేపటికి మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆటగాళ్లు సహా స్టేడియం మొత్తం ఖాళీ చేయాలని అత్యవసర ప్రకటన వచ్చింది.
తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు. మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్ ద్వారా పఠాన్‌కోట్ గుండా ఢిల్లీకి తరలించారు.
బ్లాక్ అవుట్ అంటే ఏంటి..?
యుద్ధం లేదా ఎమర్జెన్జీ పరిస్థితుల్లో నగరాన్ని మొత్తం చీకటి చేయడం. శత్రువుల వైమానిక దాడులను కష్టతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇలా చేస్తే శత్రువుల టార్గెట్ మిస్ అవుతుంది. ఫలితంగా దాడుల నుంచి రక్షణ పొందొచ్చు.