
ఐపీఎల్-2025 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పంజాబ్ విధించిన 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది.
ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో ఐదు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే, ఆరో ఓవర్ మూడో బంతికి రాహుల్ (21 బంతుల్లో 35) మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.
ఆ తర్వాతి ఓవర్లలో డుప్లెసిస్ (15 బంతుల్లో 23) కూడా అవుటయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44) మెరుపులు మెరిపించగా .. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సెదీకుల్లా అటల్ (22) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సమీర్ రిజ్వీ ధనాధన్ దంచికొట్టాడు. 22 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు.. తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
మొత్తంగా 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ 18 పరుగులతో అతడికి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ లక్ష్యాన్ని అందుకుంది.
ఇక పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ రెండు, మార్కో యాన్సెన్, ప్రవీణ్ దూబే ఒక్కో వికెట్ తీశారు. కాగా అగ్ర స్థానంపై కన్నేసిన పంజాబ్ ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం 17 పాయింట్లతో ఉన్న పంజాబ్ ఆఖరిదైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిస్తేనే టాప్-2లో నిలిచే అవకాశం ఉంటుంది.
శ్రేయస్ ఫిఫ్టీ, స్టొయినిస్ మెరుపులు
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. జైపూర్ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (6)ను ముస్తాఫిజుర్ రహ్మాన్ సింగిల్ డిజిట్ స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు.
అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. కానీ శ్రేయస్ అవుటైన తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ మళ్లీ నెమ్మదిగా సాగింది.
నేహాల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11) నిరాశపరచగా.. మార్కస్ స్టొయినిస్ మెరుపులతో పంజాబ్ 200 పరుగుల మార్కు దాటింది. స్టొయినిస్ 16 బంతుల్లో 44 పరుగులతో రాణించాడు. ఆఖర్లో హర్‌ప్రీత్ బ్రార్ 2 బంతుల్లో 7 పరుగులతో స్టొయినిస్‌తో కలిసి నాటౌట్‌గా నిలిచాడు.
ఇక ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లు తీయగా.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.