
Photo Courtesy: BCCI
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సీజన్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో కలుపుకుని సూర్య ఇప్పటివరకు మూడు సార్లు (2025 (510*), 2023 (605), 2018 (512)) ఓ సీజన్‌లో 500 ప్లస్ పరుగులు చేశాడు. సూర్య తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సీజన్లు 500 ప్లస్ పరుగులు చేసిన ఘనత సచిన్ టెండూల్కర్ (2010, 2011), క్వింటన్ డికాక్‌కు (2019, 2020) దక్కుతుంది. వీరిద్దరు తలో రెండు సార్లు ఈ ఘనత సాధించారు.
ఇవాళ (మే 6) గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్య ఈ సీజన్‌లో 500 పరుగుల మార్కును తాకాడు. ఈ మ్యాచ్‌లో సూర్య సీజన్ లీడింగ్ రన్ స్కోరర్‌గానూ అవతరించాడు. ఈ మ్యాచ్‌లో 24 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేసిన సూర్య సాయి కిషోర్ బౌలింగ్‌లో షారుక్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సీజన్‌లో సూర్య 12 మ్యాచ్‌ల్లో 510 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ సాధించే క్రమంలో సూర్య విరాట్‌ను (505) అధిగమించాడు.
ఈ సీజన్‌లో సూర్య చేసిన స్కోర్లు..
29(26), 48(28), 27*(9), 67(43), 28(26), 40(28), 26(15), 68*(30), 40*(19), 54(28), 48*(23) & 35(24)
ఈ సీజన్‌లో టాప్-6 లీడింగ్ రన్ స్కోరర్లు..
సూర్యకుమార్ యాదవ్-510
విరాట్ కోహ్లి- 505
సాయి సుదర్శన్- 504
యశస్వి జైస్వాల్- 473
జోస్ బట్లర్- 470
శుభ్‌మన్ గిల్- 465
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆది నుంచే కష్టాలు ఎదురయ్యాయి. రెండో బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ రికెల్టన్ (2) ఔటయ్యాడు. నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ (7) పెవిలియన్‌కు చేరాడు. అనంతరం విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35) కాసేపు నిలకడగా ఆడినా.. స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. ఆతర్వాత వచ్చిన తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్యా (1), నమన్ ధిర్ (7) ఇలా వచ్చి అలా వెళ్లారు.
16.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 123/7గా ఉంది. కార్బిన్ బాష్ (4), దీపక్ చాహర్ క్రీజ్‌లో ఉన్నారు. పవర్ ప్లేలో గుజరాత్ ఆటగాళ్లు మూడు సునాయాసమైన క్యాచ్‌లు వదిలి పెట్టినా ముంబై ఇండియన్స్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు. శుభ్‌మన్ గిల్ మూడు క్యాచ్‌లు పట్టాడు.