
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి (ముంబైలో). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేసింది.
9 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు మాత్రమే చేసింది. రికెల్టన్ (25), రోహిత్ శర్మ (5), విల్ జాక్స్ (21) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (13), తిలక్ వర్మ (7) క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
కుల్దీప్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో రికెల్టన్ వికెట్ తీయడంతో కుల్దీప్ ఐపీఎల్‌లో 100 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనతను కుల్దీప్ 97 మ్యాచ్‌ల్లో సాధించాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు పూర్తి చేసిన టాప్-5 స్పిన్నర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన స్పిన్నర్లుగా అమిత్ మిశ్రా, రషీద్ ఖాన్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. వీరు ముగ్గురు 83 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని తాకారు. ఈ జాబితాలో చహల్ (84 మ్యాచ్‌లు), సునీల్ నరైన్ (86) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. కుల్దీప్ నాలుగో స్థానంలో నిలిచాడు.
ప్లే ఆఫ్స్ సమీకరణలు ఇలా..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు (గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్) ఖరారయ్యాయి. మిగిలిన ఏకైక బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇరు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, వీరి ప్లే ఆఫ్స్ భవితవ్యం ఇవాల్టి మ్యాచ్‌తో దాదాపుగా డిసైడైపోతుంది.
ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఇంకో మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ అప్పుడే ఖరారు కాదు. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై (మే 24) కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.
ఒకవేళ ఢిల్లీ.. ముంబైపై గెలిచి, పంజాబ్ చేతిలో ఓడినా ప్లే ఆఫ్స్ బెర్త్‌పై సందిగ్దత కొనసాగుతుంది. మే 26న జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ముంబై ఆ మ్యాచ్‌లో కూడా ఓడితే లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.