MI vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌కు ఎదురుదెబ్బ | IPL 2025 MI Vs DC: BCCI Punished Delhi Capitals Pacer Mukesh Kumar For Breaching IPL Code Of Conduct | Sakshi
Sakshi News home page

MI Vs DC: ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌కు మరో ఎదురుదెబ్బ

May 22 2025 9:01 AM | Updated on May 22 2025 10:39 AM

IPL 2025 MI vs DC: BCCI Punished Delhi Capitals Pacer Mukesh Kumar

Photo Courtesy: BCCI/IPL

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌ (Mukesh Kumar)కు ఐపీఎల్‌ పాలక మండలి జరిమానా విధించింది. అతడి మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా జత చేసింది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు బుధవారం ముంబై ఇండియన్స్‌తో తలపడింది.

సూర్య, నమన్‌ ధనాధన్‌
ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ పోరులో టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్‌ చేసింది. ఆరంభంలో ఆకట్టుకున్నా.. ఆఖర్లో ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 73 నాటౌట్‌), నమన్‌ ధిర్‌ (8 బంతుల్లో 24 నాటౌట్‌) అద్భుతంగా రాణించడంతో ముంబై మెరుగైన స్కోరు సాధించింది.

నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ (2/48) రెండు వికెట్లతో రాణించగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆరంభం నుంచే తడబడింది.

ఢిల్లీ తడ‘బ్యా’టు
ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (11), కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (6) పూర్తిగా విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్‌ పోరెల్‌ (6) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో సమీర్‌ రిజ్వీ (39), విప్రాజ్‌ నిగమ్‌ (20) కాసేపు పోరాడే ప్రయత్నం చేశారు.

అయితే, ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎక్కువ సేపు నిలవలేకపోయింది. 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో 59 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ప్లే ఆఫ్స్‌ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

అనుచిత ప్రవర్తన
ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ముకేశ్‌ కుమార్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఐపీల్‌ ప్రవర్తనా నియమావళిలలోని ఆర్టికల్‌ 2.2 (ఆటకు సంబంధించిన వస్తువులు, దుస్తులు, గ్రౌండ్‌కు చెందిన ఎక్విప్‌మెంట్‌ను డ్యామేజ్‌ చేయడం) ప్రకారం ముకేశ్‌ కుమార్‌ లెవల్‌ 1 తప్పిదానికి పాల్పడ్డాడు.

ఇందుకు సంబంధించి మ్యాచ్‌ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు’’ అని ఐపీఎల్‌ పాలక మండలి తెలిపింది. అయితే, ముకేశ్‌ కుమార్‌ చేసిన తప్పేమిటో మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న వేళ ఈ ఢిల్లీ పేసర్‌ కాస్త అసహనానికి లోనైన విషయం తెలిసిందే.

ఇక ముంబైతో కీలక మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ దూరమైన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఈ ఆల్‌రౌండర్‌ సేవలను జట్టు వినియోగించుకోలేకపోయింది. అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఢిల్లీని ముందుకు నడిపించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోవడంతో ఇంటిబాట పట్టింది.

చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్‌ ఆన్‌ చేయగానే 500 మిస్స్‌డ్‌ కాల్స్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement