
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తద్వారా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. ఢిల్లీ మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.
ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. తొలి 18 ఓవర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడిన ముంబై.. ఆఖరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ రెండు ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు.
ముకేశ్ కుమార్, చమీరా వేసిన ఈ ఓవర్లలో ఏకంగా 48 పరుగులు పిండుకున్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 25, రోహిత్ శర్మ 5, విల్ జాక్స్ 21, తిలక్ వర్మ 27, హార్దిక్ పాండ్యా 3 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, దుష్మంత చమీరా, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగింది. ఆ జట్టు 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై 59 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. సాంట్నర్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, చాహర్, జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీశారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సమీర్ రిజ్వి (39) టాప్ స్కోరర్ కాగా.. విప్రాజ్ నిగమ్ (20), అశుతోష్ శర్మ (18), కేఎల్ రాహుల్ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.