
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025)ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశే మిగిలింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా టాప్-4 నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. ముంబై ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది.
గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తో పాటు ముంబై టైటిల్ పోరులో నిలిచింది. మరోవైపు.. ముంబై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ సీజన్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లలో గెలిచి కూడా.. ప్లే ఆఫ్స్ చేరని ఏకైక జట్టుగా నిలిచింది.
వరుసగా నాలుగు విజయాలు
కాగా ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ (Axar Patel) పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో తొలుత లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడ్డ ఢిల్లీ.. ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. మరుసటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టిన అక్షర్ సేన.. చెపాక్‌లో సీఎస్‌కేను 25 పరుగుల తేడాతో ఓడించింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇలా సీజన్‌లోని తొలి నాలుగు మ్యాచ్‌లలో గెలుపొందిన ఢిల్లీ.. ఆ తర్వాత అదే జోరును కనబరచలేకపోయింది.
ముంబై చేతిలో అపుడూ ఓడిన ఢిల్లీ
ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన(ఏప్రిల్ 13) ఢిల్లీ సీజన్‌లో తొలి పరాజయం చవిచూసింది. అయితే, మరుసటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడ్డ ఢిల్లీ అదృష్టవశాత్తూ సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన అక్షర్ సేన.. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్‌పై సీజన్‌లో రెండో విజయం సాధించింది.
అయితే, ఆర్సీబీ మాత్రం ప్రతీకారం తీర్చుకుని ఢిల్లీలోనే ఢిల్లీ జట్టును ఓడించింది. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలోనూ అక్షర్ సేన ఓడిపోయింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో గట్టెక్కింది. అనంతరం పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ మ్యాచ్ సాంకేతిక కారణాల (ఆపరేషన్ సిందూర్) వల్ల ఆగిపోయింది.
ఆ తర్వాత గుజరాత్‌ను ఢీకొట్టిన ఢిల్లీ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో మరోసారి ఓటమిని చవిచూసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వాంఖడే వేదికగా ఢిల్లీ జట్టు.. హార్దిక్ సేనతో తలపడింది.
సూర్య, నమన్ ధనాధన్
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్), నమన్ ధీర్ (24 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు కూల్చగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్ రహ్మాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
లక్ష్య ఛేదనలో ఢిల్లీ విలవిల
ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ చేతులెత్తేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (11), తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (6).. వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్(6) దారుణంగా విఫలమయ్యారు. సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
మిగతా వారంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు మాత్రమే చేసి ఢిల్లీ ఆలౌట్ అయింది. దీంతో ముంబై చేతిలో 59 పరుగుల తేడాతో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇలా ఐపీఎల్ సీజన్ ఆరంభంలో వరుసగా తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ.. ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిబాట పట్టిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ అపవాదును మూటగట్టుకుంది. కాగా లీగ్‌లో తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ పంజాబ్‌తో తలపడనుంది.
చదవండి: వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
Dominant victory ✅
Playoffs ✅
A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏
Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025