
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా కేకేఆర్, సీఎస్‌కే మధ్య ఇవాళ (మే 7) జరుగుతున్న మ్యాచ్‌లో అజింక్య రహానే ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి ఔటైన రహానే.. ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన ఏడో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా తొమ్మిదో ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
రహానే తన 197 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. రహానేకు ముందు విరాట్ కోహ్లి (8509), రోహిత్ శర్మ (6928), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528), ఎంఎస్ ధోని (5406), ఏబీ డివిలియర్స్ (5162), కేఎల్ రాహుల్ (5064) ఐపీఎల్‌లో 5000 పరుగుల మార్కును అధిగమించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్ 11, సునీల్ నరైన్ 26, రహానే 48, రఘువంశీ 1 పరుగు చేసి ఔట్ కాగా.. రసెల్ 17, రసెల్ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ 2, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.
కాగా, ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ ఓ మార్పు చేసింది. వెంకటేశ్ అయ్యర్ స్థానంలో మనీశ్ పాండే తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో ప్రయోగాల బాట పట్టింది. ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే, అశ్విన్ తుది జట్టులోకి వచ్చారు.
ఈ సీజన్‌లో సీఎస్‌కే కథ ముగిసిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది.
కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఇంకా పోటీలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 11 పాయింట్లు సాధించింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ వచ్చింది. కేకేఆర్ ఈ మ్యాచ్‌తో కలుపుకుని ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.
తుది జట్లు..
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), సునీల్ నరైన్, అజింక్యా రహానే(c), అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి
ఇంపాక్ట్ సబ్స్: హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, లువ్నిత్ సిసోడియా, అన్రిచ్ నోర్ట్జే, మయాంక్ మార్కండే
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్హత్రే, ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, రవిచంద్రన్ అశ్విన్, MS ధోని(w/c), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా
ఇంపాక్ట్ సబ్స్: శివమ్ దూబే, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, జామీ ఓవర్టన్, దీపక్ హుడా