
Photo Courtesy: BCCI
తన దృష్టిలో ఎప్పటికీ అనుభవానికి పెద్ద పీట ఉంటుందని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. గతంలో సీనియర్లతోనే తాము వరుసగా టైటిల్స్ గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపవాదు మూటగట్టుకున్న సీఎస్‌కే.. పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది ఇప్పటికి ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలిచి దారుణంగా విఫలమైంది.
సీనియర్లు విఫలం
యువ ఆటగాళ్లు ఆయుశ్ మాత్రే, నూర్ అహ్మద్, డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) లాంటివారు రాణించినా... జట్టు నమ్ముకున్న సీనియర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా లీగ్‌లో ఎంతో అనుభవం ఉన్నా కనీస ప్రదర్శన ఇవ్వలేదు. అయితే తమ టీమ్ వైఫల్యానికి పలు కారణాలు ఉన్నాయని కోచ్ ఫ్లెమింగ్ అన్నాడు. అయితే, ఆటగాళ్ల వయసు ఇందుకు కారణం కాదని పేర్కొన్నాడు.
అనుభవం అమూల్యమైంది
‘ఆటగాళ్ల వయసు ఎంత ఎక్కువగా ఉందనేది నేను పట్టించుకోను. నా దృష్టిలో అనుభవం అమూల్యమైంది. గత కొన్నేళ్లలో మాకు అదే ఎన్నో విజయాలు అందించింది. ఈ సీజన్‌లో అది పని చేయకపోవచ్చు. ఫలితం అందరికీ నిరాశ కలిగించిన మాట వాస్తవమే కానీ వైఫల్యానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి’ అని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.
ఇన్నేళ్లుగా చెన్నై టీమ్ సీనియర్ల ఆటతో అనుసరిస్తున్న వ్యూహాలను ఇకపై కూడా మార్చాల్సిన అవసరం లేదని స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. ‘సీనియర్లపై నమ్మకం ఉంచడంతో పాటు ప్రతిభాన్వేషణ కూడా ఈ సమయంలో ముఖ్యం. జట్టులో యువ ఆటగాళ్లు ఉండాలని అందరూ అంటున్నారు. కానీ వారందరినీ వెతికి తెచ్చుకోవాలి కదా. జట్టులో వారు సరిపోతారో లేదో చూడాలి.
అనుభవజ్ఞులతో కలిపి వారిని ఆడించాలి. ఈ సీజన్‌లో కొందరు కొత్త కుర్రాళ్లు చెలరేగడం నిజమే అయినా అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్ల ఆటగాళ్ల జాబితా చూస్తే ఐపీఎల్‌లో అనుభవం ఉన్నవారే కనిపిస్తారు. మాకు ఈ సీజన్ పెద్ద సవాల్‌గా నిలిచింది. ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం’ అని ఫ్లెమింగ్ వివరించాడు.
చదవండి: IPL 2025: దిగ్వేష్ సింగ్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్! వీడియో వైరల్