
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. నిన్న (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. గౌహతిలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో రాయల్స్ కీలకమైన క్షణాలన్నిటినీ అధిగమించి విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో రాయల్స్‌కు ఇది తొలి విజయం.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో రాయల్స్ ఇంకా భారీ స్కోర్ చేసుండాల్సింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) రాయల్స్‌కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో రాయల్స్ ఊహించిన దానికంటే 20-30 పరుగులు తక్కువ చేసింది.
రాయల్స్ ఇన్నింగ్స్‌లో నితీశ్‌తో పాటు శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నితీశ్‌ను ఔట్ చేశాక సీఎస్‌కే పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకుంది.
పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసింది. నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2) మరోసారి అద్భుతమైన స్పెల్స్ వేశారు. ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పర్వాలేదనిపించాడు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఓవర్టన్ (2-0-30-0), అశ్విన్ (4-0-46-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కేకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను ఈ సీజన్‌లో చెత్త ఫామ్‌లో ఉన్న జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. అనంతరం రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్) పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు.
హసరంగ (4-0-35-4) తన స్పెల్ ప్రతి ఓవర్‌లో వికెట్ తీసి సీఎస్‌కేను ఇరకాటంలో పడేశాడు. సీఎస్‌కే గెలుపుకు చివరి 3 ఓవర్లలో 45 పరుగులు కావాల్సి ఉండింది. ధోని, జడ్డూ క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు నిలబడితే సీఎస్‌కే ఎలాగైనా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడే తీక్షణ మ్యాజిక్ చేశాడు.
18వ ఓవర్‌లో అతను కేవలం 6 పరుగులే ఇచ్చి సీఎస్‌కేకు లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్‌లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో జడ్డూ, ధోని చెలరేగగా (బౌండరీ, 2 సిక్సర్లు) చివరి ఓవర్‌లో సీఎస్‌కే లక్ష్యం 20 పరుగులుగా మారింది.
ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆర్చర్‌కు (3-1-13-1) చివరి ఓవర్ ఇవ్వకుండా రాయల్స్ కెప్టెన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆర్చర్‌కు బదులుగా సందీప్ శర్మను నమ్ముకోగా.. అతను కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి బంతికే ధోని వికెట్ తీసి ఆతర్వాత రెండు బంతులను సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు.
దీంతో సీఎస్‌కే గెలుపుకు చివరి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు అవసరమయ్యాయి. అక్కడికీ ఓవర్టన్ నాలుగో బంతికి సిక్సర్ బాది సీఎస్‌కే గెలుపు ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే ఐదో బంతికి రెండు పరుగులే రావడంతో సీఎస్‌కే ఓటమి ఖరారైపోయింది. చివరి ఓవర్‌ను సందీప్ శర్మకు ఇవ్వడంతో టెన్షన్ పడ్డ రాయల్స్ అభిమానులు చివరికి ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు (రెండు మ్యాచ్‌ల తర్వాత) రియాన్ పరాగ్ కెప్టెన్‌గా తన తొలి విజయాన్ని నమోదు చేశాడు. ఈ గెలుపు సొంత అభిమానుల మధ్య దక్కడం అతనికి మరింత స్పెషల్.
మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నితీశ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లేలో అతని ఆటతీరు అమోఘం. నితీశ్ ఎక్కువగా వెనుక భాగంలో షాట్లు ఆడుతున్నాడని తెలిసి కూడా మేము చురుగ్గా లేము. అతన్ని వికెట్‌కు ముందు ఆడించే ప్రయత్నం చేసుండాల్సింది. మిస్ ఫీల్డ్‌ల ద్వారా అదనంగా 8-10 పరుగులు సమర్పించుకున్నాము. ఫీల్డింగ్‌లో చాలా మెరుగుపడాలి.
ఈ వికెట్‌పై 180 పరుగులు ఛేదించదగ్గ టార్గెటే. ఇన్నింగ్స్ బ్రేక్‌లో సంతోషపడ్డాను. వారు 210 పరుగులకు పైగా స్కోర్ చేస్తారని అనుకున్నాను. మా బౌలర్లు బాగా కంట్రోల్ చేశారు. జరగాల్సిన నష్టం ఆదిలోనే జరిగిపోయింది.
మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. గత కొన్ని సీజన్లలో రహానే 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రాయుడు మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకునేవాడు. నేను కూడా మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకోవడానికి కొంచెం ఆలస్యంగా వస్తే మంచిదని భావించాము. అయితే అది వర్కౌట్ కాలేదు.
మూడు మ్యాచ్‌ల్లోనూ ఆట ప్రారంభంలోనే బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. వేలం సమయంలోనే నేను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని నిర్ణయించబడింది. ఈ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దురదృష్టవశాత్తు ఈ సీజన్‌లో మాకు మంచి ఆరంభాలు లభించడం లేదు.
ఒక్కసారి మా ఓపెనర్లిద్దరూ టచ్‌లోకి వస్తే పరిస్థితులు మారతాయి. ఎప్పటిలాగే నూర్ బాగా బౌలింగ్ చేశాడు. ఖలీల్, జడ్డూ కూడా సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో కొంత ఊపు అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా రాణిస్తే మా జట్టుకు తిరుగుండదు.