IPL 2023: ఆ ముగ్గురు 3 ఓవర్లే బౌల్‌ చేశారు.. సీఎస్‌కేకు మేలు జరిగింది! నీకెందుకంత అక్కసు? అదే ముంబై అయితే..

IPL 2023 CSK vs GT: Fans Blasts Irfan Pathan For Advantage To CSK Tweet - Sakshi

IPL 2023 Winner CSK: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులు మండిపడుతున్నారు. సీఎస్‌కేపై అంత అక్కసు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చెన్నై స్థానంలో ముంబై ఇండియన్స్‌ ఉంటే ఇలాగే మాట్లాడేవాడివా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. సొంత రాష్ట్ర జట్టుపై అభిమానం ఉండటంలో తప్పులేదని.. కానీ అది ఇతరులను తక్కువ చేసే విధంగా మాత్రం ఉండకూడదంటూ హితవు పలుకుతున్నారు.

కాగా ఐపీఎల్‌-2023 విజేతగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ అవతరించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రిజర్వ్‌ డే మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది ధోని సేన. డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసి పదహారో ఎడిషన్‌ చాంపియన్‌గా అవతరించింది.

ఒక్కొక్కరికి మూడు ఓవర్లు
నిజానికి మే 28(ఆదివారం)న జరగాల్సిన ఈ మ్యాచ్‌ ఎడతెరిపిలేని వర్షం కారణంగా మరుసటి రోజుకు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, సోమవారం కూడా వరుణుడు అడ్డు తగలడంతో లక్ష్య ఛేదనలో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ 214 పరుగుల భారీ స్కోరు చేయగా.. చెన్నై విజయసమీకరణాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు. అదే విధంగా ఒక్కో బౌలర్‌ కేవలం 3 ఓవర్ల్‌ బౌల్‌ చేసేందుకు అనుమతినిచ్చారు.

జడ్డూ విన్నింగ్‌ షాట్‌
ఈ క్రమంలో టార్గెట్‌ ఛేదనలో భాగంగా సీఎస్‌కే ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(26), డెవాన్‌ కాన్వే (47) శుభారంభం అందించగా.. శివం దూబే(32- నాటౌట్‌), అజింక్య రహానే (27), అంబటి రాయుడు (8 బంతుల్లో 19) తలా ఓ చెయ్యి వేశారు.

ఆఖరి రెండు బంతుల్లో చెన్నై గెలుపునకు 10 పరుగుల అవసరమైన వేళ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వరుసగా 6,4 బాది చిరస్మరణీయ విజయం అందించాడు. దీంతో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఐదోసారి ట్రోఫీ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌తో చెన్నై సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది.

ఈ నేపథ్యంలో సీఎస్‌కేతో పాటు ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. మ్యాచ్‌ ముగిసి రోజులు గడుస్తున్నా.. సోషల్‌ మీడియాలో సందడి కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ చేసిన ట్వీట్‌ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది. ఇంతకీ అతడేమన్నాడంటే..

సీఎస్‌కేకు అడ్వాంటేజ్‌గా మారింది
‘‘వర్షం కారణంగా కుదించిన మ్యాచ్‌లో సీఎస్‌కే షమీ బౌలింగ్‌లో బ్యాటింగ్‌ మొదలెట్టింది. నాలుగు ఓవర్ల రెగ్యులర్‌ కోటాలో రషీద్‌, మోహిత్‌ ఒక్కో ఓవర్‌  కోల్పోవాల్సి వచ్చింది. 

లీగ్‌ టాప్‌ వికెట్‌ టేకర్లలో ముగ్గురు 18 బంతులు వేసేందుకే పరిమితమయ్యారు. అందులో ఇద్దరు వికెట్లు తీయలేకపోయారు. అది సీఎస్‌కేకు ప్రయోజనం చేకూర్చింది’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ మంగళవారం ట్విటర్‌లో పేర్కొన్నాడు.

ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘షమీ/రషీద్‌, మోహిత్‌ కలిసి 3 ఓవర్లలో 54 బంతులు వేశారు. సీఎస్‌కే 108 పరుగులు సాధించింది. ఒకవేళ వాళ్లు పూర్తిస్థాయిలో బౌలింగ్‌ చేసినా 145 పరుగులు చేసేది. మ్యాచ్‌ 20 ఓవర్లపాటు జరిగినా సీఎస్‌కే 19వ ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించేది. 

మనకు అసలు ఈ ఉత్కంఠ రేపే మ్యాచ్‌ చూసే అవకాశమే వచ్చేది కాదు. అయినా, నీకెందుకు అంత అక్కసు ఇర్ఫాన్‌ పఠాన్‌’’ అని ఏకిపారేస్తున్నారు. కాగా గుజరాత్‌కు చెందిన ఇర్ఫాన్‌ 2003లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. 2012లో భారత్‌ తరఫున తన చివరి మ్యాచ్‌ ఆడాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.

చదవండి: అది చాలా పెద్ద తప్పు.. అంబటి రాయుడుకి అన్యాయం చేశారు: కుంబ్లే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top