Odean Smith-IPL 2022: ఓ మ్యాచ్‌లో విలన్‌గా, రెండు మ్యాచ్‌ల్లో హీరోగా.. ఐపీఎల్‌ 2022లో ఓడియన్‌ స్మిత్‌ ప్రస్థానం

IPL 2022 MI VS PBKS: Odean Smith Goes From Villain To Hero - Sakshi

IPL 2022: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 13) జరిగిన హైఓల్టేజీ పోరులో ముంబై ఇండియన్స్‌ పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో 12 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ ఓటమితో ముంబై ప్రస్తుత సీజన్‌లో వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుని, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రోహిత్‌ సేనను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌లో సత్తా చాటిన మయాంక్‌ సేన.. ప్రత్యర్థికి 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 

అనంతరం పంజాబ్‌ ప్లేయర్లు బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లోనూ ప్రతాపం చూపి, ముంబై ఇండియన్స్‌ను 186 పరుగులకే కట్టడి చేశారు. పంజాబ్ ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలి ఇద్దరు (తిలక్‌ వర్మ, పోలార్డ్‌) కీలక ప్లేయర్లను రనౌట్ చేయగా, బౌలింగ్‌లో ఓడియన్‌ స్మిత్‌ విశ్వరూపాన్ని ప్రదర్శించి చివరి ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముంబై గెలుపుకు 6 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన దశలో బంతిని అందుకున్న స్మిత్‌.. అద్భుతమైన బంతులు సంధించి ముంబై లోయరార్డర్‌ను కకావికలం చేశాడు.

ఈ మ్యాచ్‌లో బంతితో రాణించి పంజాబ్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన స్మిత్‌.. తన తొలి ఐపీఎల్‌ సీజన్‌లోనే మిశ్రమ అనుభవాలను రుచి చూశాడు. ఆర్సీబీతో జరిగిన తన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విశ్వరూపం (8 బంతుల్లో 25 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) చూపి పంజాబ్‌ను గెలిపించిన స్మిత్‌.. కేకేఆర్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లో బంతితో ఘోరంగా విఫలమై, జట్టు ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఆ మ్యాచ్‌లో రసెల్‌ విధ్వంసం ధాటికి బలైన స్మిత్‌.. ఒకే ఓవర్‌లో 24 పరుగులు సమర్పించుకుని పంజాబ్‌ అభిమానుల దృష్టిలో విలనయ్యాడు. అయితే తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తిరిగి గాడిలో పడిన అతను.. విలన్‌ ఇమేజ్‌ నుంచి బయటపడి హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.    
చదవండి: దటీజ్‌ జానియర్‌ 'ఏబీ'.. ఐపీఎల్‌ 2022లోనే భారీ సిక్సర్‌.. వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top