ఆసీస్‌ భారీ స్కోర్‌.. ఛేదనలో విశ్వరూపం ప్రదర్శించిన టీమిండియా బ్యాటర్‌ | Ind A vs Aus A 3rd ODI: Prabhsimran Singh smashed 102 from just 68 balls | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ భారీ స్కోర్‌.. ఛేదనలో విశ్వరూపం ప్రదర్శించిన టీమిండియా బ్యాటర్‌

Oct 5 2025 7:45 PM | Updated on Oct 5 2025 7:45 PM

Ind A vs Aus A 3rd ODI: Prabhsimran Singh smashed 102 from just 68 balls

భారత్‌-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల (India A vs Australia A) మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 5) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా (Australia) 49.1 ఓవర్లలో 316 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. 

కూపర్‌ కన్నోలీ (64), లియామ్‌ స్కాట్‌ (73), కెప్టెన్‌ జాక్‌ ఎడ్వర్డ్స్‌ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్‌ భారీ స్కోర్‌ చేసేందుకు దోహదపడ్డారు.

44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్‌ షా (32) సాయంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్‌ స్కాట్‌, ఎడ్వర్డ్స్‌ సంచలన ఇన్నింగ్స్‌లతో భారీ స్కోర్‌ అందించారు. స్కాట్‌, ఎడ్వర్డ్స్‌ ఏడో వికెట్‌కు 152 పరుగులు జోడించి, భారత్‌కు కఠిన సవాల్‌ విసిరారు.

భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా చెరో 3 వికెట్లు తీయగా.. పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ ఆయుశ్‌ బదోని 2, గుర్జప్నీత్‌ సింగ్‌, నిషాంత్‌ సంధు తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ప్రభ్‌సిమ్రన్‌ విశ్వరూపం
అనంతరం 317 భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ (Team India).. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (Prabhsimran Singh) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 24 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. 

ప్రభ్‌సిమ్రన్‌ కేవలం 68 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ తన శైలికి విరుద్దంగా నిదానంగా ఆడి 25 బంతుల్లో కేవలం రెండే ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. గత వన్డేలో సత్తా చాటిన తిలక్‌ వర్మ (3) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. 

ప్రస్తుతం కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (17), రియాన్‌ పరాగ్‌ (22) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 26 ఓవర్లలో మరో 145 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.

కాగా, ఈ మ్యాచ్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచాయి. ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం​ చేసుకుంటుంది.

వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌ కూడా జరిగింది. ఆ సిరీస్‌కు భారత్‌ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. 

చదవండి: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement