Rohit Sharma: ఆఖరి వరకు పోరాడాం.. కానీ ధోని మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు!

IPL 2022 CSK Vs MI Rohit Sharma Says Towering MS Dhoni Took Them Home - Sakshi

IPL 2022 CSK Vs MI - Rohit Sharma Comments: ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియన్స్‌ పరాజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్‌లు ఓడిపోయిన రోహిత్‌ సేన.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో చేతిలోనూ ఓటమి పాలైన పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి బంతికి సీఎస్‌కే బ్యాటర్‌ ఎంఎస్‌ ధోని ఫోర్‌ బాదడంతో ముంబై పరాజయం ఖరారైంది.

అప్పటి వరకు విజయం తమవైపే ఉందనకున్న రోహిత్‌ సేనకు ధోని అద్భుత ఫినిషింగ్‌ టచ్‌తో భంగపాటు తప్పలేదు. దీంతో వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ ముంబై పరాజయం మూటగట్టుకుంది. దీంతో ముంబై ప్లే ఆఫ్‌ చేరే దారులు దాదాపుగా మూసుకుపోయాయి.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ఆఖరి వరకు తమ బౌలర్లు పోరాడిన తీరు అద్భుతమని, అయితే ఆఖర్లో ధోని మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాడని అన్నాడు. ‘‘చివరి వరకు మేము గట్టిగానే పోరాడాము. బ్యాటింగ్ విభాగం ఆశించిన మేర రాణించకపోయిప్పటికీ.. మా బౌలర్లు ఆఖరి వరకు గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచారు. కానీ ఎంఎస్‌డీ(ధోని) లాంటి మహోన్నత బ్యాటర్‌ క్రీజులో ఉంటే ఏం జరుగుతుందో తెలుసు కదా! నిజానికి మేము సరైన ఆరంభం అందుకోలేకపోయాం. 

మొదట్లోనే వికెట్లు టపాటపా కూలిపోతే పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. అయితే, మా బౌలర్లు ప్రత్యర్థిని ఆఖరి వరకు ఒత్తిడిలోకి నెట్టారు. చివరి ఓవర్‌ చివరి బంతి వరకు మ్యాచ్‌ను లాక్కొచ్చారు. కానీ ప్రిటోరియస్‌, ధోని చెన్నైని గెలిపించారు. మేము బ్యాట్‌తోనూ, బంతితోనూ రాణించాల్సి ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ను మెరుపరచుకుని తిరిగి పుంజుకుంటాం’’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 3 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆఖరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని ఫోర్‌ బాది తనదైన శైలిలో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 13 బంతులు ఎదుర్కొన్న తలైవా 3 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ప్రిటోరియస్‌ సైతం 14 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. ఇక సీఎస్‌కే బ్యాటర్లలో అంబటి రాయుడు(40) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఐపీఎల్‌ 2022- మ్యాచ్‌ 33: ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ స్కోర్లు:
ముంబై- 155/7 (20)
చెన్నై- 156/7 (20) 
మూడు వికెట్ల తేడాతో చెన్నై విజయం

చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌ చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి జట్టుగా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top