IPL 2022 Mega Auction: Three Team Target On Shreyas Iyer, Details Inside - Sakshi
Sakshi News home page

IPL: అతడికి 16 కోట్లు.. అయ్యర్‌కు ఇప్పటి వరకు 35 కోట్లు.. ఆర్సీబీ, పంజాబ్‌, కేకేఆర్‌ పోటీ... రికార్డు బద్దలవడం ఖాయం!

Published Mon, Jan 17 2022 9:08 AM

IPL 2022 Auction: Shreyas Iyer In Great Demand 3 Teams Eyeing On Him Reports - Sakshi

IPL 2022 Auction: ఐపీఎల్‌ మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే కొత్త ఫ్రాంఛైజీలు లక్నో, అహ్మదాబాద్‌ ఎంట్రీకి మార్గం సుగమం కావడంతో ఆటగాళ్లను ఎంచుకునే పనిలో పడ్డాయి. ఇరు జట్లు చెరో ముగ్గురు ఆటగాళ్లను(ఇద్దరు స్వదేశీ, ఓ విదేశీ) ఎంచుకోవాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఇప్పటికే డెడ్‌లైన్‌ విధించిన నేపథ్యంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త జట్లకు కెప్టెన్లు ఎవరా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇక లక్నో కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ పేరు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తుండగా... అహ్మదాబాద్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను కాదని హార్దిక్‌ పాండ్యా వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 

ఒకవేళ అదే నిజమైతే అయ్యర్‌ మెగా వేలంలోకి రావడం ఖాయం. ఇప్పటికే బ్యాటర్‌గా నిరూపించుకోవడం సహా ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యంతో సమవర్థవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయస్‌ అయ్యర్‌... టీమిండియాలోనూ కీలక సభ్యుడిగా ఎదుగుతున్నాడు. కాబట్టి అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు పోటీ పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇక విరాట్‌ కోహ్లి ‘గుడ్‌ బై’ చెప్పడంతో ఆర్సీబీ, మోర్గాన్‌ లేకపోవడంతో కేకేఆర్‌, రాహుల్‌ జట్టును వీడటంతో పంజాబ్‌ కింగ్స్‌.. కొత్త కెప్టెన్‌ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూడు జట్లలో ఏదో ఒకటి కచ్చితంగా శ్రేయస్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి ఈ యువ ఆటగాడు భారీ ధర పలికే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఇప్పటి వరకు క్రిస్‌ మోరిస్‌ పేరు మీదే!
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు అ‍త్యధిక ధర పలికిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌ 2021 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ అతడిని 16.25 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుత వేలంలో ఫ్రాంఛైజీ మధ్య పోటీ, డిమాండ్‌ దృష్ట్యా శ్రేయస్‌ అయ్యర్‌ ఈ రికార్డు బద్దలు కొట్టే అవకాశం లేకపోలేదు. 

చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ అరంగేట్రం!.. నా మొదటి ప్రాధాన్యం అదే!

‘‘ఐపీఎల్‌ మెగా వేలం-2022లో అయ్యర్‌ హాటెస్ట్‌ ప్రాపర్టీ. అతడిని కెప్టెన్‌గా నియమించుకోవాలని మూడు ప్రధాన జట్లు భావిస్తున్నాయి. కాబట్టి అతడు భారీ ధర పలకడం ఖాయమే. తనలోని నాయకత్వ లక్షణాలు, బ్యాటర్‌గా తనకున్న రికార్డును కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఇది నిజమే అనిపిస్తుంది కదా’’ అని ఐపీఎల్‌ వేలం గురించిన అంశాలను నిశితంగా పరిశీలిస్తున్న క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. 

అయితే ఈ అంశాల గురించి సదరు మూడు ప్రధాన జట్లుగా భావిస్తున్న ఆర్సీబీ, పంజాబ్‌, కేకేఆర్‌ వర్గాలను ఆశ్రయించగా.. ‘‘మా వ్యూహాలు మాకు ఉన్నాయి. ఐపీఎల్‌ వేలం వరకు ఎదురుచూడకతప్పదు’’ అని సమాధానం దాటవేశాయని  జాతీయ మీడియా పేర్కొంది.

అయ్యర్‌ ఐపీఎల్‌ సాలరీ ఎంతంటే!
ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌ మనీబాల్‌ డేటా ప్రకారం... ఇప్పటి వరకు ఐపీఎల్‌ ద్వారా శ్రేయస్‌ అయ్యర్‌ 35.8 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏడు ఐపీఎల్‌ సీజన్లు ఆడిన అయ్యర్‌ ఈ మొత్తం అందుకున్నట్లు సమాచారం. ఇక 87 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన అయ్యర్‌ 2375 పరుగులు చేశాడు. 

చదవండి: IPL 2022: ధోని ‘గుడ్‌ బై’.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!?

Advertisement
 

తప్పక చదవండి

Advertisement