వెంటాడుతున్న కరోనా : ఆలస్యం కానున్న ఐపీఎల్‌

IPL 2020 Schedule May Delay Reason For Coronavirus - Sakshi

ఆటగాళ్లను వెంటాడుతున్న కరోనా వైరస్‌

అబుదాబి : క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)- ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య తొలి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తొలి మ్యాచ్‌ ఆడేందుకు సీఎస్‌కే ఇంకా సన్నద్ధం కాలేదు. ఆటగాళ్లతో పాటు టీం సిబ్బంది కూడా కరోనా వైరస్‌ బారినపడటం ఆందోళనకరంగా మారింది. అందరి కంటే ముందే దుబాయ్‌కు చెక్కేసిన ధోనీ సేన కరోనా కారణంగా ఇంకా క్వారెంటైన్‌లోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇద్దరు ప్రధాన ఆటగాళ్లతో పాటు మరో 10 మంది సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు. ఈ ప్రభావం లీగ్‌ ఆరంభ మ్యాచ్‌పై పడే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ భావిస్తోంది. (కరోనా ‘ఆట’ మొదలైంది!)

ఈ నేపథ్యంలో బోర్డు సీనియర్‌ అధికారి సమాచారం ప్రకారం.. షెడ్యూల్‌లో స్పల్ప మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా లీగ్‌ను కొంత ఆసల్యంగా ప్రారంభించాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అనుకున్న దానికంటే ఆటగాళ్లపై ఆరంభంలోనే కరోనా ప్రభావం చూపడంతో అసలు లీగ్‌ సాధ్యమవుతుందా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్ల క్వారెంటైన్‌ ముగించుకుని ప్రాక్టీస్‌ ఆరంభించినా.. వైరస్‌ ఎటు నుంచి దాడి చేస్తోందనే భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (సీఎస్‌కేలో కరోనా కలకలం)

ఇక ఇదిలావుండగా సీఎస్‌కే సీనియర్‌ ఆటగాడు సురేష్‌ రైనా ఉన్నపళంగా ఇంటిదారి పట్టడం క్రికెట్‌ అభిమానులను షాకింగ్‌కి గురిచేసింది. ఐపీఎల్‌-2020 సీజన్  నుంచి రైనా తప్పుకుంటున్నట్లు జట్టు యాజమాన్యం అనుహ్యంగా ప్రకటించి అందరినీ అశ్చర్యంలో ముంచెత్తింది. అయితే దానికి గల కారణాలు మాత్రం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top