నేడు ఆస్ట్రేలియాతో భారత్ చివరి టి20
ఒత్తిడిలో ఆతిథ్య జట్టు
మధ్యాహ్నం గం. 1:45 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
బ్రిస్బేన్: గత టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత సూర్యకుమార్ యాదవ్ భారత టి20 జట్టు కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టాడు. అతని సారథ్యంలో ఆడిన నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచిన టీమిండియా... ఆసియా కప్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు జట్టు సిద్ధమైంది.
ఆ్రస్టేలియాతో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు చివరిదైన ఐదో మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిస్తే భారత్ 3–1తో సిరీస్ గెలుచుకుంటుంది. ఒకవేళ ఓడినా సిరీస్ చేజారిపోయే ప్రమాదం ఉండదు. మరోవైపు ఆతిథ్య ఆ్రస్టేలియా మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉంది. స్వదేశంలో సిరీస్ కోల్పోరాదని ఆ జట్టు పట్టుదలగా ఉంది. ఈనేపథ్యంలో ఆసీస్ శైలికి తగినట్లు చక్కటి బౌన్స్ ఉండే గాబా మైదానంలో ఆసక్తికర పోరు ఖాయం. మ్యాచ్ రోజు స్వల్ప వర్షసూచన ఉంది.
గిల్ సత్తా చాటేనా...
ఆసీస్ పర్యటనకు ముందు శుబ్‌మన్ గిల్ వన్డే, టి20 ఫామ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజంగానే అతను పూర్తి స్థాయిలో ఇక్కడ తడబడ్డాడు. రెండు ఫార్మాట్‌లలో ఏడు ఇన్నింగ్స్‌లు కలిపి ఒక్క అర్ధ సెంచరీ కూడా అతను నమోదు చేయలేకపోయాడు. ఇలాంటి స్థితిలో బాగా ఆడి ఘనంగా ముగింపు పలకాలని గిల్ భావిస్తున్నాడు. మరో ఓపెనర్ అభిõÙక్ దూకుడును కొనసాగిస్తుండగా, సూర్యకుమార్ ఫామ్ కూడా అంతంత మాత్రమే.
గత 18 ఇన్నింగ్స్‌లలో సూర్య ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ దాటలేదు. తిలక్ వర్మ కూడా తనదైన శైలిలో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. గత మ్యాచ్‌లో భారత్ చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో నెగ్గినా, మన బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్, సుందర్‌లతో పాటు దూబే రెండు విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కనబర్చడం సానుకూలాంశం.
మరో స్పిన్నర్ వరుణ్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థి ని మరోసారి కష్టంగా మారనుంది. వరుసగా రెండు విజయాలు అందించిన తుది జట్టులో టీమిండియా మార్పులు చేయకపోవచ్చు. అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్ల మైలురాయికి ఒకే ఒక వికెట్ దూరంలో ఉన్న స్టార్ బౌలర్ బుమ్రా చెలరేగితే ప్రత్యర్థి కి కష్టాలు తప్పవు.
బ్యాటింగ్ తడబాటు...
ప్రధాన ఆటగాళ్లు హేజల్‌వుడ్, హెడ్‌లాంటి వాళ్లు సిరీస్ మధ్యలో తప్పుకున్న తర్వాత ఆసీస్ జట్టులో పూర్తి తడబాటు కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్ తరహాలో నెమ్మదైన పిచ్‌లు ఉన్న హోబర్ట్, కరారాలలో ఆ జట్టు బ్యాటర్లు పూర్తి చేతులెత్తేశారు. మన స్పిన్నర్లను ఎదుర్కోవడం ఎవరి వల్లా కావడం లేదు. ఫలితంగా తక్కువ స్కోర్లతో జట్టుకు పరాజయాలు ఎదురయ్యాయి.
అభిమానులందరి దృష్టీ యాషెస్ సిరీస్‌పై ఉండటంతో ఈ టి20 సిరీస్ ఫలితం జట్టుకు పెద్దగా నష్టం కలిగించకపోవచ్చు కానీ వరుసగా మూడు టి20 మ్యాచ్‌లు ఓడటం టీమ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. ఇలాంటి స్థితిలో కనీసం సిరీస్‌ను ‘డ్రా’గానైనా ముగించాలని జట్టు కోరుకుంటోంది. మిచెల్ మార్ర్ష్ ఒక్కడే బ్యాటింగ్‌లో నిలకడ కనబరుస్తుండగా, మిగతా వారంతా విఫలమయ్యారు.
టాప్–4లో షార్ట్, ఇన్‌గ్లిస్, టిమ్ డేవిడ్ రాణిస్తే భారీ స్కోరు సాధ్యమవుతుంది. మ్యాక్స్‌వెల్ ఇక్కడైనా మెరుస్తాడేమో చూడాలి. జట్టు బౌలింగ్‌లో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. భారత స్పిన్నర్లు చెలరేగిన చోట ఆడమ్ జంపా భారీగా పరుగులిస్తున్నాడు.


