ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగనున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్లను నిన్న (జనవరి 17) ప్రకటించారు. ఈ పర్యటనలో టీమిండియా-ఆస్ట్రేలియా 3 టీ20లు, ఓ టెస్ట్, 3 వన్డేలు ఆడతాయి. వీటిలోని పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్టును ప్రకటించారు.
గాయాల నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్ శ్రేయంక పటిల్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చింది. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూపీఎల్‌లో సత్తా చాటడంతో (ఆర్సీబీ తరఫున 5 వికెట్ల ప్రదర్శన) శ్రేయంకకు మరోసారి అవకాశం వచ్చింది.
టీ20 జట్టులో మరో ఆసక్తికర ఎంపిక భారతి ఫుల్మాలి. ఈమె చివరిగా 2019లో భారత్ తరఫున టీ20 ఆడింది. ఆతర్వాత పేలవ ఫామ్ కారణంగా కనుమరుగైంది. గతేడాది డబ్ల్యూపీఎల్‌లో ఓ మోస్తరు ప్రదర్శనలతో తిరిగి లైన్‌లోకి వచ్చింది. ప్రస్తుత సీజన్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తుండటంతో ఆరేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చింది.
హర్లీన్ డియోల్‌పై వేటు
గత సిరీస్‌లో టీమిండియాలో భాగమైన హర్లీన్ డియోల్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూపీఎల్‌లో రాణిస్తున్నా, సెలెక్టర్లు ఆమెపై వేటు వేశారు. పై మార్పులు మినహా టీ20 జట్టులో పెద్దగా గమనించదగ్గ విషయాలేమీ లేవు. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధన కొనసాగారు.
ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధన (VC), షఫాలి వర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), జి కమలిని (WK), అరుంధతి రెడ్డి, అమంజోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, శ్రేయంక పటిల్
షఫాలీ స్థానం పదిలం
వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో పలు ఆసక్తికర ఎంపికలు జరిగాయి. వరల్డ్‌కప్‌లో ఓపెనర్ ప్రతికా రావల్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన షఫాలీ వర్మ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. షఫాలీ వరల్డ్‌కప్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియా ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచకప్ సందర్భంగా గాయపడిన ప్రతికా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. వికెట్‌కీపర్ యస్తికా భాటియా కూడా శస్త్రచికిత్స తర్వాత రీహాబ్‌లో ఉండటంతో ఈ సిరీస్‌కు దూరమైంది.
జి కమలినికి వికెట్‌కీపింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండటంతో వన్డే జట్టులోకి కూడా వచ్చింది. ఈ జట్టులో రాధా యాదవ్, అరుంధతి రెడ్డికి చోటు దక్కలేదు. కశ్వీ గౌతమ్ కొత్తగా జట్టులోకి వచ్చింది.
ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధన (VC), షఫాలి వర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), జి కమలిని (WK), కశ్వీ గౌతమ్, అమంజోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్
ఆసీస్ పర్యటన షెడ్యూల్
టీ20 సిరీస్:
- ఫిబ్రవరి 15 – సిడ్నీ క్రికెట్ గ్రౌండ్
- ఫిబ్రవరి 19 – మానుకా ఓవల్
- ఫిబ్రవరి 21 – అడిలైడ్ ఓవల్
వన్డే సిరీస్:
- ఫిబ్రవరి 24 – బ్రిస్బేన్ (అల్లన్ బోర్డర్ ఫీల్డ్)
- ఫిబ్రవరి 27 & మార్చి 1 – హోబార్ట్ (బెల్లెరివ్ ఓవల్)
ఏకైక టెస్ట్:
- మార్చి 6- పెర్త్ (పెర్త్ స్టేడియం)
* టెస్ట్ జట్టును ప్రకటించాల్సి ఉంది.


